ఇండిగో ఇష్యూలో మోడీకి.. మనోడికి తేడాలున్నాయా?

వందలాది సర్వీసులు ఉన్నట్లుండి రద్దు చేయటం.. గంటల కొద్దీ వాయిదా వేయటం.. ఇలా ఇష్టరాజ్యంగా వ్యవహరించిన ఇండిగో విమానయాన సంస్థ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2025-12-10 04:36 GMT

వందలాది సర్వీసులు ఉన్నట్లుండి రద్దు చేయటం.. గంటల కొద్దీ వాయిదా వేయటం.. ఇలా ఇష్టరాజ్యంగా వ్యవహరించిన ఇండిగో విమానయాన సంస్థ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని విమానయాన రంగంలో 63 శాతానికి పైగా వాటా ఉన్న ఇండిగో.. కొత్త నిబంధనల అమలుకు 22 నెలల పాటు గడువు ఇచ్చిన తర్వాత కూడా వాటిని అమలు చేయని బరితెగింపుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంటే.. అందుకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి నుంచి అందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు రావటమేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా ఎన్డీయే ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు కాస్తంత సిత్రంగా ఉండటం గమనార్హం. విమానాల నిర్వహణ లోపాలతో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తవద్దన్న ఆయన.. ‘‘చట్టాలు.. నిబంధనలు ఏవైనా సరే వ్యవస్థల్ని సరి చేసేలా ఉండాలే తప్ప.. ప్రజలను వేధించొద్దు’’ అని పేర్కొనటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్న.

విమాన విధుల సమయ నియంత్రణ రెండో దశలో కఠిన నిబంధనల కారణంగా.. పైలట్లు.. సిబ్బందిని సర్దుబాటు చేయలేక ఇండిగో చేతులు ఎత్తేసిందనే కన్నా.. కొత్త నిబంధనల్ని నిజాయితీగా అమలు చేయాలన్న ఉద్దేశం ఆ సంస్థకు లేదన్న విషయం చిన్న పిల్లాడికి సైతం అర్థమైన వేళ.. ప్రధాని మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయటం చూస్తే.. తప్పులు చేసినోళ్లను.. దారుణంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఇండిగోను వెనకేసుకొచ్చినట్లుగా మాట్లాడటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.

ఎన్డీయే ఎంపీల భేటీ అనంతరం ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యల వివరాల్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడిస్తూ.. విమాన నిర్వహణ సమస్యల కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దన్న ఆయన.. ప్రజలు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఎదరవకూడదని.. నిబంధనలు.. చట్టాలు ముఖ్యమే అయినా అవన్నీ వ్యవస్థల్ని సరి చేసేలా ఉండాలే కానీ ప్రజల్ని వేధించేలా ఉండకూడదని స్పష్టం చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు విన్నప్పుడు ఇండిగో ఇష్యూలో ఆయన ఆలోచనలకు.. విమానయాన శాఖ మంత్రి కం మనోడు, తెలుగోడు (రామ్మోహన్ నాయుడు) ఆలోచనల్లో తేడా ఉన్నట్లుగా అనిపించకమానదు.

ఇదిలా ఉంటే.. విమానాల రద్దుతో సంక్షోభానికి తెర తీసిన ఇండిగోపై కేంద్రం చర్యలకు దిగింది. శీతాకాలానికి సంబంధించి ఆ సంస్థకు కేటాయించిన సర్వీసుల్లో పది శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీసులను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్లుగా పేర్కొంది. ఇప్పటివరకు ఇండిగోకు రోజుకు 2200కు పైగా సర్వీసుల నిర్వహణకు అనుమతి ఉండగా.. తాజా కోతతో అవి రోజుకు 1950 కంటే తక్కువకు తగ్గిపోన్నాయి. లక్షలాది మందిని తీవ్ర వేధింపులకు.. మానసిక వేదనలకు కారణమైన ఇండిగోకు తగినశాస్తి జరగాల్సిందే. ఆ విషయంలో అస్సలు తగ్గొద్దన్నట్లుగా ప్రజలు అనుకోవటం గమనార్హం.

Tags:    

Similar News