పెద్ద పండుగ ముందు రైల్వే భారీ షాక్
తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఎక్కడెక్కడ నుంచే తెలుగు గ్రామాలకు ప్రజలు చేరుకుంటారు. ముచ్చటగా మూడు రోజుల పండగ అది.;
తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఎక్కడెక్కడ నుంచే తెలుగు గ్రామాలకు ప్రజలు చేరుకుంటారు. ముచ్చటగా మూడు రోజుల పండగ అది. ఇక ఇదే పేరుతో కాకపోయిన ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే సమయంలో వేరు వేరు పండుగలు చేసుకుంటారు. అలా చూస్తే దేశంలో జనవరిలో పెద్ద పండుగలే ఉన్నాయి. మరి అలాంటి పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేసింది. అదేంటి అంటే రైల్వే చార్జీలను పెంచేయడం. ఒక్కసారిగా ఈ భారం సామాన్యుల మీద ప్రజల మీద పడుతోంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రైలే దిక్కుగా :
దూర ప్రాంతాల ప్రయాణాలకు రైల్వే దిక్కు. అదే ఆధారం కూడా రైలు ప్రయాణం అయితే చౌక అన్న భావన ఉంది. అత్యధిక సంఖ్యలో ప్రజలు రైల్వే ప్రయాణానికే ఇష్టపడతారు. ఎందుకంటే తమకు ఆర్థికంగా కలిసి వస్తుందని. అలాంటిది రైల్వే చార్జీలను టైం చూసుకుని మరీ అన్నట్లుగా పెంచేశారు. దాంతో ఇపుడు పేదలు మధ్యతరగతి వర్గాలు అయితే ఏమిటీ షాక్ ట్రీట్మెంట్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 26 నుంచి :
ఇలా పెరిగిన రైల్వే చార్జీలు ఈ నెల 26 నుండి అమలులోకి వచ్చేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల పెంపుని అయితే రైల్వే శాఖ సమర్థించుకుంటోంది. హేతుబద్ధంగా పెంచామని చెబుతున్నారు. అయితే ఇపుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు ద్రవ్యోల్బనం నేపథ్యంలో ఏ మాత్రం పెరిగినా అది అధిక భారమే అని అంటున్నారు. ఇక చూస్తే కనుక సవరించిన ప్రకారం సాధారణ తరగతిలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణాలకు ఛార్జీల పెరుగుదల ఉండదని కొంత వరకూ భరోసా అయితే ఇచ్చారు.
వాటి మీద వడ్డన :
ఇక ఆ మీదట అంటే 215 కిలోమీటర్లకు మించి ప్రయాణాలకు సాధారణ తరగతిలో కిలోమీటరుకు 1 పైసలు పెరగనుండగా మెయిల్ అలాగే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఎసి తరగతికి కిలోమీటరుకు 2 పైసలు ఛార్జీలు పెరుగుతాయి. ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో ప్రయాణ ఖర్చు కూడా కిలోమీటరుకు 2 పైసలు పెరిగింది. దీంతో నాన్ ఏసీ, ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలకు ప్రతి 500 కిలోమీటర్ల దూరానికి 10 రూపాయలు అదనంగా ఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు.
అదనపు ఆదాయంగా :
ఇలా పెంచిన రైల్వే చార్జీల వల్ల సుమారు 6 వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. గత దశాబ్దంలో రైలు నెట్‌వర్క్ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించాయని అందుకే ఈ చార్జీల పెంపుదల అని పేర్కొంటోంది. రైల్వేలలో మరిన్ని కొత్త కార్యకలాపాల నిర్వహణకు అలాగే భద్రతను పెంచడానికి ఈ పెంపు వల్ల ఉపయోగం జరుగుతుందని అంటున్నాయి.
పెరిగిన ఖర్చులతో :
మరో వైపు చూస్తే రైల్వే ఉద్యోగుల వేతనాల ఖర్చు ఏకంగా 1,15,000 కోట్ల రూపాయలకు పెరిగిందని, పెన్షన్ ఖర్చు అరవై వేల కోట్లకు పెరిగిందని రైల్వే శాఖ చెబుతోంది. ఇక గత ఏడాది అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే కార్యకలాపాల మొత్తం ఖర్చు ఏకంగా 2,63,000 కోట్లకు పెరిగినట్లు లెక్కలు చెబుతోంది. అందుకే రైల్వే ఛార్జీల పెంపుదల తప్పనిసరి అని అంటోంది. కానీ ఏ మాత్రం పెరిగిన ధరలు సామాన్యుని మీద పెను భారమే అని అంటున్నారు.