అమెరికాపై భారత్ భారీ టారిఫ్ లు.. ముదిరిన వాణిజ్య యుద్ధం
భారతదేశం కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించనున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థకు (WTO) తెలియజేసింది.;
భారతదేశం కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించనున్నట్లు ప్రపంచ వాణిజ్య సంస్థకు (WTO) తెలియజేసింది. భారతీయ ఉక్కు , అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చర్య ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనడానికి సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు.
కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులపై ఇప్పటివరకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసి, వాటిపై దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు భారత్ తన ప్రకటనలో పేర్కొంది. అమెరికా విధించిన టారిఫ్‌ల కారణంగా సుమారు 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా. అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య వైఖరిని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.
గతంలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా భారీగా టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ముడి ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌పై ఈ టారిఫ్‌ల ప్రభావం అధికంగా పడనుంది. ఈ నేపథ్యంలో, భారత్ ఈ అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి బలంగా తీసుకెళ్లింది.
ఆసక్తికరంగా న్యూఢిల్లీ -వాషింగ్టన్ ఒక సరికొత్త వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని వార్తలు వస్తున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు ఈ ఒప్పందంలో భాగంగా భారత్ అనేక రాయితీలను ప్రతిపాదించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే, తాజా పరిణామాలు ఈ ఒప్పందం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాతో వాణిజ్య సంబంధాలలో ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. ఒకవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయంటూనే, మరోవైపు ప్రతీకార సుంకాలకు సిద్ధపడటం ఇరు దేశాల మధ్య నెలకొన్న సంక్లిష్ట వాణిజ్య వాతావరణాన్ని సూచిస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకుంటాయో చూడాలి.