భారత్ నుంచి 'ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్' కు ఛాన్స్ ఉందా?

ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. నాడు పాకిస్థాన్ లో నక్కిన సంగతి తెలిసిందే.;

Update: 2025-05-01 10:47 GMT

ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. నాడు పాకిస్థాన్ లో నక్కిన సంగతి తెలిసిందే. దీంతో.. అతడిని మట్టుబెట్టడానికి నాటి అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామా పర్యవేక్షణలో సీల్స్ బృందం 'ఆపరేషన్ నెఫ్ట్యూన్ స్పియర్' ను చేపట్టి లాడెన్ మట్టుపెట్టింది. అయితే... భారత్ కూడా ఈ తరహా ఆపరేషన్ చేసే ఛాన్స్ ఎంతనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ప్రపంచంలోనే కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు 9/11 దాడితో కలిగించిన నష్టం అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిని అగ్రరాజ్యం సీరియస్ గా తీసుకుంది. పక్కాగా ప్లాన్ చేసి 'ఆపరేషన్ నెఫ్ట్యూన్ స్పియర్' ను చేపట్టి లాడెన్ ను తన ఇంట్లోనే గదిలో ఉండగా కాల్చి చంపింది. అనంతరం అతని మృతదేహాన్ని కనిపించకుండా చేసింది!

ఈ సమయంలో అదే పాకిస్థాన్ లో ఐక్యరాజ్య సమితి, అగ్రరాజ్యం అమెరికాలు అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా చీఫ్, ముంబైలో 26/11 దాడుల ప్రధాన సూత్రధారిగా చెబుతున్న హఫీజ్ సయీద్ విషయంలో భారత్ కూడా ఆ తరహా ఆపరేషన్ చేసే ఛాన్స్ ఎంత ఉంది అనే చర్చ తెరపైకి వచ్చింది.

వాస్తవానికి హఫీజ్ సయీద్ జైల్లో ఉన్నాడని పాకిస్థాన్ ప్రపంచం ముందు బుకాయిస్తోన్న సంగతి తెలిసిందే. ఏకంగా 31 ఏళ్ల శిక్ష పడటంతో అతడు జైలులో మగ్గుతున్నాడని చెప్పుకొస్తుంది. అయితే... వాస్తవం ఏమిటనే విషయం తాజాగా బయట ప్రపంచానికి తెలిసింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా హఫీజ్ పాకిస్థాన్ లో ఎక్కడ, ఎంత సేఫ్ గా ఉన్నది వెలుగులోకి వచ్చింది.

ఇందులో భాగంగా... లష్కరే తోయిబా ఉగ్రవాది లాహోర్ లోని జోరమ్ తౌమ్ అనే అత్యంత రద్దీ ప్రాంతంలో జనాలతో కలిసి అతడు జీవిస్తున్నాడని.. అతడి నివాసానికి పాకిస్థాన్ ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని.. ఆ ఇంటి పక్కనే మసీదు, మదర్సా ఉండగా.. పక్కనే ఓ ప్రైవేటు పార్కు, భవనం కింద ఓ బంకర్ కూడా ఉందని చెబుతున్నారు.

పైగా పహల్గాంలో పర్యాటకులపై జరిపిన ఉగ్రవాద దాడి వెనుక ప్రధానంగా హఫీజ్ సయీద్ హస్తం ఉందని భారత నిఘా వర్గాలు, దర్యాప్తు సంస్థలు భావిస్తున్న నేపథ్యంలో... తాజాగా అతడికి పాక్ ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసిందని.. అతని ఇంటికి సుమారు 4కి.మీ. మేర అధునాతన సీసీ కెమెరాలు అమర్చిందని కథనాలొస్తున్నాయి.

మరోపక్క ఇతడు నివశిస్తున్న ఈ ప్రాంతంలో ఆర్మీకి చెందినవి మినహా మరే ఇతర డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించారని.. ఇదే సమయంలో హఫీజ్ ఇంటి సమీపంలో సమాన్య పౌరులెవరికీ అనుమతి లేదని తెలుస్తోంది! ఈ నేపథ్యంలో... పక్కాగా లొకేషన్ తెలిసిన నేపథ్యంలో.. భారత్ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టే అవకాశాలపై చర్చ మొదలైంది.

వాస్తవానికి గతంలో ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్ లోనే ఉన్నప్పటికీ.. అబోట్టాబాద్ లోని ఓ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు. అయితే.. అది జనావాసాలకు దూరంగా ఉంది. దీంతో.. అమెరికా పని సులువైంది. అయితే... హఫీజ్ సయీద్ మాత్రం జనవాసాల మధ్య ఉండటంతో అతడి కోసం ఆపరేషన్ చేపడితే అది కాస్త క్లిష్టంగానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే.. పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్ లోని సామాన్య పౌరులు, పర్యాటకులను టార్గెట్ చేసి చంపిన అనంతరం... జనావాసాల మధ్య హఫీజ్ ఉన్నా అది పెద్ద సమస్య కాకపోవచ్చనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం మదిలో ఏముంది..? సైనిక దళాలకు మోడీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన వేళ వారి మనసుల్లో ఏముంది..? అనేది వేచి చూడాలి.

అయితే... భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన హఫీజ్ సయీద్ ను కొట్టాలనుకుంటే.. ఇకపై ఆ దేశం భారత్ వైపు కన్నెత్తి చూడకూడదంటే.. ఆర్థికంగానూ, దౌత్యపరంగానూ చాలా బలహీనంగా ఉన్న ఈ దశలోనే నిర్ణయం తీసుకుంటే పని సులువవుతుందనే చర్చా.. మాజీ మిలటరీ అధికారుల నుంచి వినిపిస్తుండటం గమనార్హం!

Tags:    

Similar News