వేసవిలో వర్షాల దెబ్బ.. 16ఏళ్లలో ఈ సారే ముందుగా రుతుపవనాలు

భారత వాతావరణ విభాగం (IMD) మే 26న వెల్లడించిన దాని ప్రకారం.. నైరుతి రుతుపవనాలు తమ సాధారణ తేదీ కంటే ఏకంగా 16 రోజుల ముందుగానే ముంబైని చేరుకున్నాయి.;

Update: 2025-05-27 13:52 GMT

ఈ వేసవిలో నిప్పులు కురిసే ఎండలు కాకుండా, భారీ వర్షాలతో వాతావరణం చల్లబడుతుందని భారత వాతావరణ విభాగం(IMD)గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది దీర్ఘకాలిక సగటులో 108 శాతం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది రుతుపవనాలు ఏకంగా 16 సంవత్సరాలతో పోలిస్తే అత్యంత ముందుగా ప్రారంభం అయ్యాయి. 2024లో భారతదేశంలో 934.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంతకు ముందు ఏడాది 2023లో 820 మి.మీ. వర్షపాతం నమోదైంది, ఇది సగటు కంటే 94.4శాతం ఎక్కువ. ఈసారి మరింత ఎక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేయడం రైతన్నలకు, సాధారణ ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తోంది.

వాతవరణ శాఖ ప్రకారం.. మొత్తం రుతుపవనాల కాలంలో దేశంలో 87 సెం.మీ.ల దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 106 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో రుతుపవనాల కోర్ జోన్‌లో సాధారణం కంటే ఎక్కువ (దీర్ఘకాలిక సగటులో 106 శాతం కంటే ఎక్కువ) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రుతుపవనాల కోర్ జోన్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం వర్షపాతం నైరుతి రుతుపవనాల సమయంలోనే కురుస్తుంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ఎక్కువగా రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఉత్తర-పశ్చిమ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండవచ్చు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ.. మధ్య, దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ భారీ వర్షపాతం అంచనాలు దేశ వ్యవసాయ రంగానికి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం.

భారత వాతావరణ విభాగం (IMD) మే 26న వెల్లడించిన దాని ప్రకారం.. నైరుతి రుతుపవనాలు తమ సాధారణ తేదీ కంటే ఏకంగా 16 రోజుల ముందుగానే ముంబైని చేరుకున్నాయి. 1950 తర్వాత రుతుపవనాలు ఇంత ముందుగా ముంబైకి చేరుకోవడం ఇదే మొదటిసారి. అంతకుముందు మే 24న రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఇది 2009 తర్వాత భారతదేశ ప్రధాన భూభాగంలో ఇంత ముందుగా రుతుపవనాలు రావడం ఇదే మొదటిసారి. 2009లో మే 23న కేరళను చేరుకున్నాయి. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. జూన్ 11 నాటికి ముంబై చేరుకుంటాయి. జూలై 8 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. అవి సెప్టెంబర్ 17 నాటికి ఉత్తర-పశ్చిమ భారతదేశం నుంచి తిరిగి వెళ్లడం ప్రారంభిస్తాయి. అక్టోబర్ 15 నాటికి పూర్తిగా వెళ్లిపోతాయి. ఈసారి ముందుగానే రుతుపవనాలు యాక్టివ్ కావడంతో, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇప్పటికే మొదలయ్యాయి.

నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో ఇప్పటికే కేరళ, మహారాష్ట్రలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, కాల్వలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల నీరు నిలిచిపోయింది. మెట్రో, రైల్వే స్టేషన్ల లోపల కూడా నీరు చేరింది.

వాతావరణ శాఖ రాబోయే కొద్ది రోజుల్లో కేరళ, కర్ణాటక, తీరప్రాంత మహారాష్ట్ర, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, కేరళ, ముంబై నగరంతో సహా కొంకణ్, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు, కర్ణాటకలోని తీరప్రాంత, ఘాట్ ప్రాంతాల్లో ఈ రోజు (మే 27) అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రైతులు తమ ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధమవుతుండగా, ముందుగానే కురుస్తున్న వర్షాలు వారికి సాగుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

Tags:    

Similar News