వింటర్ లో ఆ ప్రదేశాలపై నిఘా కష్టం.. ఆర్మీకి సవాల్ విసిరే కాలం..
సరిహద్దులను రక్షించాలంటే సైన్యానికి సవాలుగా నిలిచే కాలం రానే వచ్చింది. ఎంత కష్టమైన తట్టుకునే సైన్యం వింటర్ సీజన్ వచ్చిందంటే కొంచెం వణుకుతారు.;
సరిహద్దులను రక్షించాలంటే సైన్యానికి సవాలుగా నిలిచే కాలం రానే వచ్చింది. ఎంత కష్టమైన తట్టుకునే సైన్యం వింటర్ సీజన్ వచ్చిందంటే కొంచెం వణుకుతారు. ఉత్తర భారత సరిహద్దుల్లో మంచు కురిసే కాలం ప్రారంభం కాబోతోంది. అదే సమయంలో పాకిస్థాన్ సరిహద్దు వెంట భద్రతా వ్యవస్థలో కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సారి భారత ఆర్మీ ముందుగానే ‘వింటర్ డిఫెన్స్’ వ్యూహం అమలుకు సిద్ధం అవుతోంది. పాకిస్థాన్ వైపు నుంచి ఉగ్ర చొరబాట్లకు ఇది అత్యంత అనుకూలమైన కాలం అని సైనిక వర్గాలు గుర్తించాయి. అందుకే, చలికాలపు సవాళ్లకు ఎదుర్కొనేలా సైన్యం తన భద్రతా వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించుకుంటోంది.
LOC వద్ద మార్గాల మూసివేత
కశ్మీర్ లోయలో శీతాకాలం అంటే కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు.. అది భద్రతా బలగాల పని తీరును పూర్తిగా మార్చే సమయం. మంచు కప్పిన మార్గాలు నిఘాకు పెద్ద సవాలుగా మారుతాయి. ఈ మార్గాలపై పర్యవేక్షణ దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీనిని అనుకూలంగా మలుచుకొని పాకిస్థాన్ ఉగ్రవాద గుంపులు చొరబాట్లకు ప్రయత్నిస్తుంటాయి. ఇది గతంలో మనం చూశాం.
ఈ నేపథ్యంలో ఆర్మీ కొన్ని కీలక మార్గాలను మూసివేసింది. అదనపు బలగాలను LOC వెంట మోహరించి, భద్రతా కంచెను మరింత పటిష్ఠం చేసింది. రాత్రి చలికాలపు మబ్బుల్లోనూ, ‘0 డిగ్రీల’ ఉష్ణోగ్రతల్లోనూ పనిచేసే థర్మల్ ఇమేజర్లు, హై రిజల్యూషన్ కెమెరాలు, మినీ డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఇప్పుడు ఈ భద్రతా వ్యవస్థలో భాగంగా ఉన్నాయి.
పంతా మార్చుకున్న ఉగ్రవాదులు.. భద్రతకు కొత్త పరీక్ష
గతంలో ఉగ్రవాదులు దేశంలో చొరబడిన తర్వాత దూర ప్రాంతాల్లో దాక్కునేవారు. కానీ, ఇప్పుడు వారి వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. వారు ఇప్పుడు రద్దీ ప్రాంతాల చుట్టుపక్కల చిన్న గుంపులుగా దాగి, స్థానిక ప్రజల్లో కలిసిపోతున్నారు. ప్రమాదకరమైన అంశం ఏంటంటే ఈ ఉగ్రవాదులు స్థానిక మొబైల్ నెట్‌వర్క్‌లను వాడుతున్నారు. అంటే, వారి కమ్యూనికేషన్ ట్రేస్ చేయడం కష్టంగా మారుతోంది. కాబట్టి, వారిని దేశంలోకి రానీయకుండా అడ్డుకోవడం ప్రధాన లక్ష్యం. దీని కారణంగా ఆర్మీ సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకునేలా కేంద్రీకృత భద్రతా వ్యూహం రూపొందించింది.
పహెల్గాం తర్వాత ‘ప్రివెంటివ్ సెక్యూరిటీ’
ఇటీవల పహల్గాం పరిధిలో జరిగిన దాడి తర్వాత భారత సైన్యం తన సర్వీస్ లైన్లను రీచెక్ చేస్తోంది. మునుపటి ‘రిస్పాన్స్ సెక్యూరిటీ’ బదులు ఇప్పుడు ‘ప్రివెంటివ్ సెక్యూరిటీ’ పద్ధతి అమల్లోకి తీసుకువచ్చింది. అంటే దాడి జరగకముందే ఆ అవకాశం లేకుండా చేయడం. ఇది సాధారణంగా కఠినమైనదే అయినా అత్యంత సమర్థవంతమైన వ్యూహం. ఆర్మీ ఇప్పుడు దూరం నుంచే ఉగ్ర కదలికలను గుర్తించగల సెన్సార్ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఈ సాంకేతికతతో మానవ బలగాలపై ఆధారపడడం కాస్త తగ్గింది. పరికరాల సాయంతో నిరంతర నిఘా పెడుతోంది.
సాంకేతికతే ప్రధాన ఆయుధం..
LOC వద్ద భద్రతా పహరా అనేది కేవలం గస్తీ కాదని సైనికులు చెప్తుంటారు. ఇది సహనం, చలికి తట్టుకునే మానసిక స్థితి, సాంకేతిక వినియోగం కలయిక. థర్మల్ ఇమేజర్లతో మంచు కప్పిన రాత్రుల్లో కదలికలు గుర్తించడం, డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, జీపీఎస్ ఆధారిత దిశా నియంత్రణ ఇవన్నీ కొత్త యుగం సైన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ విధంగా భారత్ కేవలం సరిహద్దును కాపాడడం మాత్రమే కాదు.. సాంకేతికత ద్వారా భద్రతను ‘స్మార్ట్ బార్డర్’ స్థాయికి తీసుకెళ్తోంది. ఇది చలికాలపు ప్రతికూల పరిస్థితుల మధ్య నిరంతర నిఘాను సాధ్యం చేస్తోంది.
సరిహద్దు రక్షణను చాలా దేశాలు యుద్ధప్రక్రియగా చూస్తాయి. కానీ అది శాంతి క్రమశిక్షణ. భారత ఆర్మీ ఇప్పుడు యుద్ధం చెయ్యడం కాదు.. యుద్ధాన్ని జరగనీయకపోవడమే ప్రధాన విజయం. చలికాలంలో చొరబాట్ల అవకాశాలు పెరిగినా.. సాంకేతికతను ఆయుధంగా మార్చుకున్న భారత ఆర్మీ అప్రమత్తంగా ముందుకెళ్తోంది. భారత ఆర్మీ LOC వద్ద తీసుకుంటున్న చర్యలు చలికాలపు చొరబాట్లను అడ్డుకోవడమే కాదు.. శాంతి స్థిరత్వానికి మౌలిక పెట్టుబడి. ‘వింటర్’ అనే పదం ఈసారి కేవలం వాతావరణం కాదు. అది జాతీయ భద్రతా పరీక్ష. భారత సైన్యం ఈ పరీక్షను మరోసారి విజయవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.