పాక్ ని ఒంటరిని చేసి కొట్టేలా... పక్కగా పావులు కదుపుతున్న భారత్!
పాక్ ను ఇప్పటికే దౌర్యపరమైన కీలక నిర్ణయాలతో ఇరుకున పెట్టిన భారత్.. ఇప్పుడు ఇస్లామాబాద్ ను ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తుంది.;
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఉగ్రవాదులకు, పాకిస్థాన్ కు వార్నింగులు, దౌత్యపరమైన షాక్ లు ఇచ్చింది. నెక్స్ట్ ఏమిటనే విషయంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో పాక్ ను ఒంటరిని చేస్తోంది.
అవును... పాక్ ను ఇప్పటికే దౌర్యపరమైన కీలక నిర్ణయాలతో ఇరుకున పెట్టిన భారత్.. ఇప్పుడు ఇస్లామాబాద్ ను ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో ప్రధానంగా పాక్ కు అన్నివేళలా మిత్రుడిగా ఉండే చైనా మద్దతును కూడగట్టింది. ఇది పాకిస్థాన్ కు కచ్చితంగా బ్యాడ్ న్యూసే. ఇదే సమయంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతోంది.
పైగా... పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఓ సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకున్న నేపథ్యంలో... చైనాతో పాటు జర్మనీ, కెనడా, పోలాండ్, యూకే, రష్యా సహా పలు జీ20 దేశాల రాయబారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చారు. వారికి ఈ విషయాన్ని భారత్ సవివరంగా వివరించింది.
సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి గురించి రాయబారులకు భారత విదేశాంగ శాఖ వివరించింది. దాడి జరిగినప్పుడు తన కుటుంబంతో కలిసి భారతదేశంలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ట్రంప్ ఇప్పటికే మోడీతో ఫోన్ లో మాట్లాడారు.. భారత్ కు తన మద్దతు ప్రకటించారు.
మరోపక్క భారతదేశం ప్రతి ఉగ్రవాదిని కనుగొని, ట్రాక్ చేసి, శిక్షిస్తుంది.. దాడి చేసినవారు, వారికి మద్దతు ఇచ్చినవారు వారి ఊహకు మించిన పరిణామాలను ఎదుర్కొంటారు అని భారత ప్రధాని మోడీ బీహార్ లోని మధుబని నుంచి తన ప్రసంగంలో హిందీ నుంచి ఇంగ్లిష్ కు మారారు. దీంతో.. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చూసుకున్నారు.
దీంతో నిమిషాల వ్యవధిలోనే అంతర్జాతీయ మీడియా ఆయన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్థావించింది. ఉగ్రవాదంపై భారత వైఖరిని మరింతగా స్పష్టం చేసింది. దీంతో... పహల్గాం ఊచకోతను అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, జపాన్, యూఏఈ, ఇజ్రాయెల్ సహా ప్రపంచ శక్తులు వేగంగా, నిస్సందేహంగా ఈ ఉగ్రదాడిని ఖండించాయి.
ఈ విధంగా ప్రపంచం ముందు పాకిస్థాన్ ను ఒంటరిని చేసే విషయంలో భారత్ సక్సెస్ ఫుల్ మూవ్స్ వేసిందనే భావించాలి. ఇప్పటికే పాకిస్థాన్ కు పక్కనున్న తాలిబాన్స్ నుంచి సమస్య ఉంది! మరోపక్క చైనా కూడా ఇప్పుడు పాక్ కు మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. బంగ్లా వంటి దేశాలు ఇచ్చినా భారత్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు. మరో "బిగ్" మూవ్ కు ఇదే సరైన సమయమేమో!