ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య.. భిన్నంగా భర్త వెర్షన్
ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి (25) ఆత్మహత్య ఉదంతం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.;
ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీబాయి (25) ఆత్మహత్య ఉదంతం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒక ఐఏఎస్ అధికారి కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకోవటం.. కొద్ది రోజులకే పుట్టింటికి వెళ్లిన ఆమె ఆత్మహత్య చేసుకోవటం.. దీనికి ఆమె భర్త వేధింపులే కారణమని ఐఏఎస్ అధికారి చిన్నరాముడు ఆరోపిస్తున్నారు. అయితే.. దీనిపై ఆమె భర్త రాజేష్ నాయుడు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను మాధురి తల్లిదండ్రులు సెప్టెంబరులోనే తీసుకెళ్లారని.. వారింట్లోనే ఉన్న ఆమె తన వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందని ఎలా అంటారు? అని ప్రశ్నిస్తున్నారు.
మాధురి తనకు పెట్టిన మెసేజ్ లను చూస్తే.. మాధురి తల్లిదండ్రుల మీద తనకు అనుమానాలు ఉన్నట్లుగా మాధురి భర్త రాజేశ్ చెబుతున్నారు. ఆదివారం రాత్రి మాధురి బాయి ఆత్మహత్య చేసుకోవటం.. తన కుమార్తె మరణానికి ఆమె భర్త రాజేశ్ వేధింపులే కారణమని చిన్నరాముడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా మాధురి తన భర్తకు పంపిన పలు మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాజేశ్ ను ఫోన్ లో సంప్రదింపులు జరిపిన కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పుట్టింటివారి మాట వినలేదని గుండు కొట్టించారని మాధురి తనకు చెప్పినట్లుగా పేర్కొన్నారు. మార్చి ఐదున మహానంది ఆలయంలో పెళ్లి చేసుకొని నంద్యాల టూ టౌన్ స్టేషన్ కు వెళితే.. అక్కడికి వచ్చిన ఆమె తల్లిదండ్రులతో తనతోనే మాధురి ఉంటానని స్పష్టం చేయటంతో.. ఆమె మెడలోని నగల్ని తీసుకొని వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. బలవంతంగా తనకు గర్భస్రావం చేయించిన విషయాన్ని మాధురి తనకు చెప్పిందన్నారు. ఓవైపు తన కుమార్తె భర్త వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఐఏఎస్ అధికారి చిన్నరాముడు చెబుతుంటే.. మరోవైపు ఆమె కుమార్తె భర్త వెర్షన్ భిన్నంగా ఉండటంతో.. పోలీసుల విచారణలో ఏం తేలుతుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.