లోరా మిస్సైల్ తో భారత వైమానిక దళానికి కొత్త శక్తి
భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.;
భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. మారుతున్న ప్రపంచ పరిస్థితులు, సరిహద్దుల వద్ద పెరుగుతున్న ముప్పు, మరియు సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించిన రక్షణ శాఖ, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ముఖ్యమైన నిర్ణయం వెలుగులోకి వచ్చింది. భారత వైమానిక దళం (IAF) వినియోగిస్తున్న సుఖోయ్-30 MKI యుద్ధవిమానాల్లో ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన లోరా (LORA - Long Range Artillery) మిస్సైళ్లను అనుసంధానించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
లోరా అనేది లాంగ్ రేంజ్ ఆర్టిలరీ వెపన్ సిస్టమ్ కు సంక్షిప్త రూపం. ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే జీపీఎస్ ఆధారిత, బహుళ ప్రయోజనాల తేలికపాటి బాలిస్టిక్ మిస్సైల్. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) ఈ మిస్సైల్‌ను అభివృద్ధి చేసింది. దీనిని భూమిపై నుంచి, సముద్రం నుంచి, గగనతలం నుంచి కూడా ప్రయోగించవచ్చు. లోరా మిస్సైల్ తక్కువ సమయంలో అధిక కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది.
- లోరా లక్షణాలు:
90 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల వరకు దీని రేంజ్ ఉంటంది.. సబ్‌సోనిక్ శబ్ద వేగం కంటే తక్కువగా ప్రయాణిస్తుంది.. జామింగ్‌కు లొంగని GPS/INS వ్యవస్థను కలిగి ఉంది. ఇది లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించడానికి సహాయపడుతుంది. 10 మీటర్లలోపు CEP (Circular Error Probability) అంటే లక్ష్యం నుండి కేవలం 10 మీటర్ల లోపల పడుతుందని అర్థం, ఇది అత్యంత కచ్చితత్వాన్ని సూచిస్తుంది. సుఖోయ్-30 MKI వంటి మల్టీరోల్ ఫైటర్ జెట్ల నుండి ప్రయోగించవచ్చు.
- భారత ప్రయోజనం ఏమిటి?
భారత వైమానిక దళం ఇప్పటికే వివిధ రకాల గగనతలం నుంచి గగనతలానికి .. గగనతలం నుంచి భూమికి ప్రయోగించే మిస్సైళ్లను ఉపయోగిస్తోంది. అయితే, లోరా మిస్సైల్‌ను సుఖోయ్ విమానాల్లో అనుసంధానం చేయడం వల్ల భారత వైమానిక దళానికి అదనపు శక్తి లభిస్తుంది . దీర్ఘదూర భూస్థాయి లక్ష్యాలను ఛేదించే శక్తి లభిస్తుంది. సురక్షితమైన దూరం నుండే శత్రు స్థావరాలు.. కీలక లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం లభిస్తుంది. అకస్మిక దాడుల సామర్థ్యం పెరుగుతుంది. శత్రు దేశ శిబిరాలపై సురక్షిత దూరం నుంచి ఆకస్మిక , కచ్చితమైన దాడులు నిర్వహించగల సామర్థ్యం పెరుగుతుంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన లక్ష్యాలను గగనతలం నుంచే నాశనం చేసే అవకాశం కలుగుతుంది.
- రక్షణ స్వయం సమృద్ధికి 'ఫోర్స్ మల్టిప్లయర్'
లోరా మిస్సైల్ సమీకరణ భారత సైనిక వ్యూహాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఇది కేవలం ఒక మిస్సైల్ మాత్రమే కాదు. దేశ రక్షణ వ్యూహంలో ఇది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా మారుతుంది. ఇటువంటి ఆధునిక సాంకేతికతను స్వీకరించడం ద్వారా భారత వైమానిక దళం తన సామర్థ్యాన్ని మరింతగా విస్తరిస్తోంది.
భవిష్యత్తులో స్వదేశీ మిస్సైళ్లను కూడా అంతే సామర్థ్యంతో అభివృద్ధి చేయడం కోసం DRDO ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే తక్షణ అవసరాల దృష్ట్యా లోరా వంటి నిరూపితమైన సాంకేతికతను సమీకరించడం ద్వారా, భారత్ వ్యూహాత్మకంగా ముందంజ వేసినట్టే అవుతుంది..
లోరా మిస్సైల్ అనుసంధానం భారత వైమానిక దళానికి ఒక కొత్త మార్గదర్శకం. ఇది శత్రుదేశాలను మానసికంగా ప్రభావితం చేసే, భారత శక్తిని స్పష్టంగా చాటే ఒక ముప్పు ఆయుధంగా మారనుంది.