ఎర్రసముద్రంలో అన్నంతపని చేసిన హూతీలు... తెరపైకి హాలీవుడ్ సినిమా సీన్!
ఈ మేరకు ఆ సంస్థ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ ఓ వీడియో విడుదల చేశారు.;
ఇటీవల పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరిగిన సమయంలో స్పందించిన యెమన్ కు చెందిన హూతీ తిరుగుబాటుదారుల నుంచి హెచ్చరికలు జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇరాన్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తో అమెరికా జట్టుకడితే.. ఎర్ర సముద్రంలోని నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని అన్నారు!
ఈ మేరకు ఆ సంస్థ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సారీ ఓ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ లకు హెచ్చరికలు చేస్తూ ఎర్రసముద్రంలో భీకర దృశ్యాన్ని సృష్టించారు! ఇందులో భాగంగా... ఎర్రసముద్రంలో ఓ భారీ ఓడను హూతీ మిలిటెంట్లు సముద్ర గర్భంలో కలిపేశారు.
అవును... ఎర్రసముద్రాన్ని వేదికగా చేసుకుని ప్రపంచ దేశాలను బెదిరిస్తున్న హూతీ మిలిటెంట్లు.. తుర్కియేకు పెద్ద మొత్తంలో సరకులతో వెళుతున్న ఓడను ముంచేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు హాలీవుడ్ సినిమా సన్నివేశాలను గుర్తుకుతెస్తున్నట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో.. అమెరికా, ఇజ్రాయెల్ కు హెచ్చరికలు చేశారు.
తాజాగా హూతీకి చెందిన మీడియా దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. పెద్ద మొత్తంలో ఎరువులు, స్టీల్ తో ఆ మేజిక్ సిస్ ఓడ తుర్కియేకు బయలుదేరింది. ఈ సమయంలో ఎర్రసముద్రంలో మాటువేసిన మిలిటెంట్లు.. ఆ నౌకను అటాక్ చేసి, అందులోకి ఎక్కారు. అందులో ఉన్న సిబ్బందితో పాటు వారు చిన్న బోట్లలోకి ఎక్కి, కాస్త దూరం వెళ్లిన తర్వాత ఆ ఓడను పేల్చేశారు.
దీనికోసం గ్రానైట్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ భారీ ఓడ మెల్లమెల్లగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన అంతటినీ డ్రోన్ వీడియోలతో చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.