అమెరికా నిబంధ‌న‌ల‌తో.. హె1బీ వీసా స్టాంపింగ్ ఆల‌స్యం

భార‌తీయుల హెచ్ 1-బి వీసా స్టాంపింగ్ ప్ర‌క్రియ ఆల‌స్యం కావ‌డం తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. వేలాది మంది అమెరికాలో ప‌నిచేయ‌డానికి వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.;

Update: 2026-01-23 07:30 GMT

భార‌తీయుల హెచ్ 1-బి వీసా స్టాంపింగ్ ప్ర‌క్రియ ఆల‌స్యం కావ‌డం తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. వేలాది మంది అమెరికాలో ప‌నిచేయ‌డానికి వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. కానీ అమెరికా తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా వీసా స్టాంపింగ్ ప్ర‌క్రియ ఆల‌స్యం అవుతోంది. దీంతో చాలా మంది ఉద్యోగాలు ప్ర‌మాదంలో ప‌డుతున్నాయి. కొంద‌రికి జీతంలో కోత విధిస్తే.. మ‌రికొంద‌రి ఉద్యోగ‌మే ఊడుతోంది. 2025 డిసెంబ‌రులో మొద‌లైన ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా మారుతోంది. చాలా మంది వీసా స్టాంపింగ్ కోసం అమెరికా నుంచి ఇండియా వ‌చ్చారు. 2026లో పూర్తీ అవుతుంద‌ని ఆశించారు. కానీ 2026లో ఉన్న ఇంట‌ర్వ్యూ స్లాట్స్.. నిబంధ‌న‌ల కార‌ణంగా 2027కు మార్చ‌బ‌డ్డాయి. దీంతో అటు ప‌నిచేస్తున్న కంపెనీకి స‌మాధానం చెప్పుకోలేక‌, మ‌రోవైపు వీసా ప్ర‌క్రియ ఆల‌స్యం కావ‌డంతో ద‌ర‌ఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వీసా స్టాంపింగ్ కోసం అమెరికా నుంచి ఇండియా రావాల‌నుకుంటున్న వారు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇంట‌ర్వ్యూ తేదీలు త‌ర‌చూ మార్చ‌బ‌డుతున్నాయి. కాబ‌ట్టి ఇక్క‌డికి వ‌చ్చి ఇబ్బందిప‌డ‌టం కంటే.. పూర్తీ స‌మాచారంతో రావాల‌ని సూచిస్తున్నారు.

ఇంట‌ర్వ్యూలు ఎందుకు ఆల‌స్యం ?

2025 డిసెంబ‌రులో ఇండియాలోని అమెరికా కాన్సులేట్ కొత్త సోష‌ల్ మీడియా నిబంధ‌న‌ల‌కు అమ‌ల్లోకి తీసుకొచ్చింది. దీనికి చాలా స‌మ‌యం అవ‌స‌ర‌మ‌వుతోంది. దీంతో ఇంట‌ర్వ్యూలు ఆల‌స్యం అవుతున్నాయి. చాలా ఇంట‌ర్వ్యూలు క్యాన్సిల్ అవుతున్నాయి. లేదా మ‌రో తేదీకి మార్చ‌బ‌డుతున్నాయి. దీనికి కార‌ణం కొత్త సోష‌ల్ మీడియా వెట్టింగ్ నిబంధ‌న‌లతో ప‌ని భారం పెరిగింది. మ‌రోవైపు కొత్త‌గా ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే వారి నుంచి, అదే విధంగా యూఎస్ లో ఉంటూ వీసా గ‌డువు ముగిసిన వారి నుంచి కూడా ఇంట‌ర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకోవ‌డంతో పోటీ తీవ్ర‌మైంది. దీంతో ఇంట‌ర్వ్యూలు ఆల‌స్యం అవుతున్నాయి.

సోష‌ల్ మీడియా వెట్టింగ్ అంటే ?

సోష‌ల్ మీడియా వెట్టింగ్ అంటే.. అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లే వ్య‌క్తికి సంబంధించిన సోష‌ల్ మీడియా ఖాతాల‌ను ప‌రీక్షించ‌డం. స‌ద‌రు వ్య‌క్తి అమెరికాకు వ్య‌తిరేకంగా ఏదైనా పోస్టుగానీ, వీడియోగానీ, కామెంట్ గానీ పెట్టారా ?. లేదా షేర్ చేశారా ?. లైక్ కొట్టారా అన్న విష‌యాల‌ను నిశితంగా ప‌రిశీలించ‌డం. అదే స‌మ‌యంలో అమెరికాలో ఏదైనా కుట్ర ప‌న్నే ఉద్దేశ్యం ఉందా ? అన్న కోణంలో విచారించ‌డం. ఇలా ప్ర‌తి ఒక్క‌రి సోష‌ల్ మీడియా ఖాతాల‌ను ప‌రిశీలించ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతోంది. దీంతో ఇంట‌ర్వ్యూలు ఆల‌స్యం అవుతున్నాయి. ఇది ఇప్ప‌టికే ఉద్యోగం చేస్తున్న వారికి, కొత్త‌గా ఉద్యోగానికి ఎంపికైన వారికి చాలా ఇబ్బందిక‌రంగా మారింది.

ఏం చేయాలి..

ద‌ర‌ఖాస్తుదారులు అవ‌స‌ర‌మైన అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఇంట‌ర్వ్యూ అపాయింట్మెంట్ కు సంబంధించి అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల‌ని చెబుతున్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నించాల‌ని సూచిస్తున్నారు. మ‌రోవైపు ఇంట‌ర్వ్యూలు ఆల‌స్యం అవుతున్న విష‌యాన్ని సంబంధిత కంపెనీకి స‌మాచారం ఇవ్వాల‌ని చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతే కొద్దికాలం ఇండియాలో ఉండి ఉద్యోగం చేసుకునేలా అనుమ‌తి తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. దీనివ‌ల్ల ఇంట‌ర్వ్యూలు ఆల‌స్యం అయినా ఉద్యోగం విష‌యంలో ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌దు.

Tags:    

Similar News