2026 హెచ్-1బీ సంక్షోభం : భారతీయ టెక్కీలకు 'గండకాలం' తప్పదా?
వీసా ఆలస్యం కారణంగా కంపెనీలు తమ ప్రాజెక్టులను కాపాడుకోవడానికి 'వర్క్ ఫ్రమ్ ఇండియా' ఆప్షన్‌ను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇది పైన కనిపిస్తున్నంత సులభం కాదు.;
అమెరికా కలలు కనే భారతీయ ఐటీ నిపుణులకు 2026 సంవత్సరం ఒక అగ్నిపరీక్షగా మారబోతోంది. అమెరికా వలస విధానాల్లో వస్తున్న మార్పులు, సాంకేతిక ఇబ్బందులు.. పెరుగుతున్న అనిశ్చితి వెరసి.. హెచ్-1బీ వీసా వ్యవస్థ ఒక గందరగోళ స్థితికి చేరుకుంది.
అపాయింట్‌మెంట్‌ల వేట.. అందని ద్రాక్షేనా?
ప్రస్తుతం హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్ పొందడం అనేది ఒక యుద్ధంలా మారింది. స్లాట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు.. ఒకవేళ ఓపెన్ అయినా క్షణాల్లో మాయమైపోతున్నాయి. ఇప్పటికే అపాయింట్‌మెంట్ దొరికిన వారికి కూడా చివరి నిమిషంలో రీషెడ్యూల్ కావడం లేదా రద్దు కావడం వంటి పరిణామాలు మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి.
రిమోట్ వర్క్: తాత్కాలిక ఉపశమనం.. శాశ్వత భారమా?
వీసా ఆలస్యం కారణంగా కంపెనీలు తమ ప్రాజెక్టులను కాపాడుకోవడానికి 'వర్క్ ఫ్రమ్ ఇండియా' ఆప్షన్‌ను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇది పైన కనిపిస్తున్నంత సులభం కాదు. రెండు దేశాల్లో పన్నులు చెల్లించాల్సి రావడం... భారత కార్మిక చట్టాలు.. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల మధ్య సమతుల్యత దెబ్బతినడం... డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లు.
ఐటీ కంపెనీల పునరాలోచన
గతంలో హెచ్-1బీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడిన అమెరికా సంస్థలు.. ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. వీసా ప్రాసెసింగ్‌లో విపరీతమైన ఆలస్యం వల్ల ప్రాజెక్ట్ డెడ్ లైన్లు మించిపోతున్నాయి. దీనివల్ల కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించుకోవడం లేదా ఇతర దేశాల కెనడా, మెక్సికో వైపు మొగ్గు చూపడం భారతీయులకు ఆందోళన కలిగించే అంశం.
ఉద్యోగుల మానసిక స్థితి
కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. కుటుంబం, పిల్లల చదువులు, ఆర్థిక ప్రణాళికలు అన్నీ ఈ వీసాపైనే ఆధారపడి ఉంటాయి. వీసా స్టాంపింగ్ కోసం భారత్ వచ్చి, తిరిగి వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయిన వేలాది మంది టెక్కీల కథలు ఇందుకు ఉదాహరణ.
నిపుణుల హెచ్చరిక
పరిపాలనా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించకపోతే 2026 నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం స్లాట్లు పెంచడమే కాకుండా డిజిటల్ పద్ధతిలో వీసా పునరుద్ధరణ వంటి ప్రక్రియలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
హెచ్-1బీ సంక్షోభం అనేది కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు.. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ, భారతీయ ప్రతిభకు మధ్య ఉన్న వారధిపై పడుతున్న దెబ్బ. రాబోయే నెలల్లో అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.