'మండలి'కి మంత్రి యోగం ఉన్నట్టేనా ..!
సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని విస్తరించడం.. లేదా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నార ని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి;
సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని విస్తరించడం.. లేదా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముగ్గురు నుంచి నలుగురు మంత్రులను పక్కన పెట్టడంతో పాటు.. ఆ వార బలమైన నాయకులను మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ పై ఫైర్ బ్రాండ్ నాయకుల మాదిరిగా విరుచుకుపడే వారికి అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాసన మండలికి అవకాశం చిక్కుతుందా? అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.
సీఎం చంద్రబాబు హయాంలో ఇటు శాసన సభ, అటు శాసన మండలి నుంచి కూడా.. సభ్యులను మంత్రి వర్గంలోకి తీసుకునే సంప్రదాయం ఉంది. గతంలో 2014-19 మధ్య యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, నారాయణలకు ఇలానే మంత్రి పదవులు దక్కాయి. వారు అప్పట్లో మండలి సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ.. తన మంత్రివర్గంలో చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అయితే.. ఈ దఫా మాత్రం చంద్రబాబు బృందంలో అందరూ.. శాసన సభకు ఎన్నికైన వారే.. మంత్రులుగా ఉన్నారు.
ఇప్పడు ఒక్కరు కూడా.. మండలికి చెందిన వారు లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో మండలిలో బల మైన వాయిస్ వినిపించడం లేదన్న చర్చ కూడా ఉంది. శాసన సభ నుంచే మంత్రులు.. కొందరు మండలిలోకి వెళ్లి.. వాయిస్ వినిపిస్తున్నారు. అలా కాకుండా.. మండలిలో ఉన్న నాయకులకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న మంత్రి వర్గ కూర్పు, చేర్పులలో మండలికి కూడా అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఒకవేళ ఈ అంచనానే కరెక్ట్ అయితే.. మండలి నుంచి ఎవరికి మంత్రి యోగం దక్కుతుంది? అనేది ఆస క్తిగా మారింది. ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. వైసీపీపై నిప్పులు చెరిగే స్వభావం ఉన్న కావలి గ్రీష్మ ప్రసాద్ వైపు అందరి వేళ్లూ కనిపిస్తున్నాయి. ఆమెను అసలు మండలికి తెచ్చింది కూడా..వైసీపీపై బలమైన వాయిస్ వినిపిస్తారనే ఉద్దేశంతోనే. ప్రస్తుతం మండలి నుంచి కొందరు వైసీపీ నాయకులు బయటకు వచ్చినా.. బలం అయితే... తగ్గలేదు.
ఈ క్రమంలో మండలిలో అధికార పార్టీ పైచేయిసాధించాలన్న ఉద్దేశంతోనే గ్రీష్మకు అవకాశం ఇచ్చారు. పనిలో పనిగా.. ఆమెకు మంత్రి పీఠం కూడా ఇస్తారా? అనేది చూడాలి. ఆమెను కాదంటే.. పురుష నాయకుల్లో ఒకరు సీమ నుంచి రెడీగా ఉన్నారని మరో చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.