మంత్రిగారి గ్రాఫ్: గొట్టిపాటి దూకుడు.. !

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పనితీరుపై ప్రభుత్వం స‌హా సీఎం చంద్ర‌బాబు సానుకూలంగానే ఉన్నారు.

Update: 2026-09-30 02:30 GMT

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పనితీరుపై ప్రభుత్వం స‌హా సీఎం చంద్ర‌బాబు సానుకూలంగానే ఉన్నారు. విద్యుత్ రంగాన్ని స్థిరీకరించే దిశగా చర్యలు తీసుకుంటూ.. ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ హ‌యాంలో విద్యుత్ ఛార్జీల పెంపు త‌ర‌చుగా ఉండేది. పైగా.. ఎప్ప‌టిక‌ప్పుడు బాదుడు పెరిగి పోయేది. ఇప్పుడు మంత్రి గొట్టిపాటి బాధ్య‌త‌లు తీసుకున్నాక‌.. చార్జీల పెంపు ఉండ‌క‌పోగా.. ఆయ‌న త‌గ్గించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

రాబోయే ఐదు సంవత్సరాల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇది ప్ర‌జ‌ల్లో ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై ఫీల్ గుడ్‌ను పెంచేసింది. ఇక‌, డిమాండ్‌కు తగిన సరఫరా విష‌యంలోనూ గొట్టిపాటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఎల్ నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగినప్పటికీ, కోతల్లేకుండా నిరంతర విద్యుత్ అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇది కూడా.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకువ‌స్తోంది.

అదే స‌మ‌యంలో డౌన్ టు ఎర్త్ అన్న‌ట్టుగా మంత్రి గొట్టిపాటి.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ఏ అవ‌స‌రం ఉన్నా.. ఏ స‌మ‌స్య ఉన్నా.. నేనున్నానంటూ.. ముందుకు వ‌స్తున్నారు. అత్యవసర స్పందనల విష‌యంలోనూ ఆయ‌న బాగానే ప‌నిచేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి త‌ర‌చుగా అభినందిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, భారీ వర్షాల‌ సమయంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసి, సరఫరాకు అంతరాయం కలగకుండా సమీక్షలు నిర్వహించారు. ఇది ప్ర‌జ‌ల్లో మంత్రికి మంచి మార్కులు వేసేలా చేసింది.

ఇక‌, కూట‌మి స‌ర్కారుకు కీల‌క‌మైన సంక్షేమ రాయితీలను కూడా తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత / సబ్సిడీ విద్యుత్, ఆక్వా రైతులు, చేనేత కార్మికులకు ఇస్తున్న రాయితీలను కొనసాగిస్తూ ప్ర‌భుత్వ ఓటు బ్యాంకును స్థిరీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. కొంత మ‌ర‌క‌లు మాత్రం ప‌డుతున్నాయి. విద్యుత్ శాఖ‌లో ఇటీవ‌ల కాలంలో అవినీతి పెరిగిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే.. మంత్రి ప్ర‌మేయం లేకుండానే ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంపై గొట్టిపాటి కొంత శ్ర‌ద్ధ పెడితే.. ఆయ‌న‌కు ఆ య‌న శాఖ‌కు కూడా తిరుగు ఉండ‌ద‌ని అంటున్నారు.

Tags:    

Similar News