బీజేపీ డీలిమిటేషన్ బిల్లు...జగన్ సంచలన నిర్ణయమేనా ?
| డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుగా గతంలో నిలిచిన వైసీపీ ఈసారి తన వైఖరి మార్చుకోవచ్చనే చర్చ జరుగుతోంది. లోక్‌సభలో పార్టీకి ఉన్న నలుగురు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేస్తారా లేక వాకౌట్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ నిర్ణయం బిల్లుపై బీజేపీ బలాబలాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాలని పట్టుదలగా ఉంది. దాని కోసం ఏకంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా పార్లమెంట్ ని ప్రోరోగ్ చేయకుండా అలాగే ఉంచింది. మూడు నెలలు పై దాటినా పార్లమెంట్ ప్రోరోగ్ కాకపోవడం ఒక రికార్డుగా చూస్తున్నారు కానీ దాని వెనక బీజేపీ గట్టి సంకల్పాన్ని కూడా చూడాలని అంటున్నారు. ఇంకో వైపు డీలిమిటేషన్ బిల్లుకి విపక్షాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. దాని కోసం కొన్ని పార్టీలను చీల్చేశారు, మరి కొన్ని పార్టీల ఎంపీలను ఆకట్టుకున్నారు. ఇంకొన్ని పార్టీల విషయంలో రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు అని విపక్ష శిబిరం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సరిగ్గా ఆరు నెలల క్రితం బీజేపీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరిపినపుడు వచ్చిన 198 ఎంపీల మద్దతు ఆ నంబర్ అలాగే ఉందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
వైసీపీ నాలుగు ఓట్లు :
లోక్ సభలో వైసీపీకి నాలుగు ఓట్లు ఉన్నాయి. అవి కూడా కలసి ఏప్రిల్ 17, 18 తేదీలలో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు 198 నంబర్ కనిపించింది. ఇపుడు వైసీపీ స్టాండ్ ఏంటి అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఈ ఆరేడు నెలలలో అనేక పరిణామాలు సంభవించాయి. అంతే కాదు బీజేపీకి వైసీపీ దూరంగా జరుగుతోంది అన్న ప్రచారమూ ఉంది. బీజేపీని ముప్పుతిప్పలు పెట్టిన కాక్రోచ్ లను జగన్ అనేక సార్లు బాహాటంగానే సమర్ధించారు. ఏపీలో కూడా కాక్రోచులు వస్తాయని కూడా ఆయన అన్నారు. అలాగే తాను కూడా అవసరం అయితే కాక్రోచ్ అవుతాను అని కూడా చెప్పుకొచ్చారు. మరో సందర్భంలో 2023లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో ప్యానెల్ కమిటీలో మార్పు విషయంలో చట్ట సవరణ జరిగింది. ఆనాడు వైసీపీ మద్దతు ఇచ్చి తప్పు చేసింది అని కూడా జగన్ అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం విషయంలో కానీ బీజేపీ విషయంలో కానీ వైసీపీ జగన్ వైఖరితో మార్పు వచ్చింది అంటున్నారు.
వ్యతిరేకంగా ఓటు :
ఈ క్రమంలో డీలిమిటేషన్ బిల్లు విషయంలో వైసీపీ తన స్టాండ్ ని మార్చుకుంటుంది అని అంటున్నారు. అలా కనుక వైసీపీ చేసిన పక్షంలో విపక్ష శిబిరానికి ఓట్లు అదనంగా పెరుగుతాయి. అదే సమయంలో నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఓట్లు వంతున నంబర్ పరంగా ఎన్డీయే కూటమికి దెబ్బ పడుతుంది. ఇది చిన్న విషయం అయితే కాదు, ఒక్కో ఓటుని ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో ప్రాణప్రదంగా భావిస్తున్న వస్తున్న బీజేపీ పెద్దలకు వైసీపీ కనుక రివర్స్ అయితే ఎలా దాన్ని చూస్తారు అన్నది కూడా ఆలోచిస్తున్నారు.
ఈసారి వాకౌట్లేనా :
గతానికి భిన్నంగా ఈసారి పార్లమెంట్ సమావేశాలలో వైసీపీ వైఖరి ఉండబోతోంది అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాల మీద గట్టిగానే మాట్లాడుతారని పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల వాకౌట్లు కూడా చూడవచ్చు అని అంటున్నారు. అదే కనుక జరిగితే దాని ప్రభావం ఏపీలో రాజకీయాల మీద పూర్తి స్థాయిలో పడనుంది అని అంటున్నారు. ఇక బీజేపీకి ఎదురు వెళ్తే వైసీపీ ఏ రకంగా కొత్త రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటుంది అన్న సందేహాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.