జనరేషన్ జెడ్ అడుగులు డార్కు టూరిజంవైపు!
అందరు నడిచే దారిలో నడిచేందుకు పెద్దగా ఇష్టపడని తరంగా జన్ జీని (జెడ్ జనరేషన్ యూత్) చెబుతారు.;
అందరు నడిచే దారిలో నడిచేందుకు పెద్దగా ఇష్టపడని తరంగా జన్ జీని (జెడ్ జనరేషన్ యూత్) చెబుతారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అస్వాదించేందుకు విపరీతంగా తపిస్తుంటారు. అలా అని కొత్తగా పరిచయమైన వాటితో కనెక్టు అవుతారా? అంటే.. అవుతారు.. ఆ వెంటనే వదిలేసి.. మళ్లీ మరో కొత్తదనం కూడా ట్రై చేస్తుంటారు. ఇప్పటి వరకు వచ్చిన తరాలకు భిన్నమైన అభిరుచులతో.. బంధాలు.. అనుబంధాల విషయంలో పట్టింపులు అంతగా లేని ఈతరం ఆలోచనలు.. అభిరులు కాస్త తేడాగా ఉంటాయి.
పుట్టినప్పటి నుంచి ఫోన్ తో తమ బంధాన్ని పెంచేసుకుంటూ.. అందులో ఉండే సోషల్ మీడియాతో కనెక్టు అయ్యేంత ఎక్కువగా మనుషులతో కాని ఈ తరం ఇప్పుడు మొగ్గు చూపుతున్నది డార్క్ టూరిజం వైపు. టూరిజం అంటే తెలుసు. ఏమిటీ డార్క్ టూరిజం అంటారా? అక్కడికే వస్తున్నాం.పేరు విన్నంతనే భయం కలిగిస్తుంది కదా. ఈ వెరైటీ టూరిజం వైపు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు జన్ జీ బ్యాచ్.
పర్యాటకం అన్నంతనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చుట్టేస్తుంది. ఈ డార్క్ టూరిజం అన్నంతనే ఒకలాంటి భయం వచ్చేస్తుంది కదా. అవును.. వారు అలాంటి మూడ్ గురించే శోధిస్తుంటారు. చీకటి చరిత్రలు.. మర్చిపోయిన వేదనలు.. భయానక మూడ్ లతో నిండి ఉండే ప్రదేశాల్ని సందర్శించటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రయాణాల్లో అద్భుత కళాఖండాలు.. భారీ గుడి గోపురాలు.. పర్యాటక కేంద్రాలుగా ఉండవు. ఇవి చరిత్రలో రక్తపు మరకల్ని.. కన్నీటి కథల్ని చెబుతాయి. పాఠ్య పుస్తకాల్లో కనిపించని ఈ కల్ట్ హిస్టరీ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయటమే డార్క్ టూరిజం.
ఇలాంటివి ఏయే ప్రదేశాలు ఉన్నాయి? అన్న సందేహం కలగొచ్చు. అక్కడికే వస్తున్నాం. అమృత్‌సర్ జలియన్ వాలా బాగ్ నే తీసుకుంటే.. ఆ నేల రక్తాన్ని మింగింది. అమాయకుల్ని అత్యంత క్రూరంగా బలి తీసుకున్న చారిత్రక దురాగతాలకు ఇదో సాక్ష్యం. ఈ ప్రదేశానికి వెళ్లిన వాళ్లకు ఆ కాలం కళ్ల ముందు కనిపిస్తుంది. నిశ్శబ్దం భయపెడుతుంది. ఆ భయమే నిజాన్నిమాట్లాడిస్తుంది. అలాంటి కోవలోకే చెందింది పోర్ట్ బ్లేర్ (అండమాన్) లోని సెల్యూలర్ జైలు. కాలాపానీ జైలు అన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది.
చరిత్ర తెలిసినోళ్లు.. బ్రిటీషోడి చట్టాన్ని అతిక్రమించినోడికి విధించే దారుణ శిక్ష. అక్కడ అడుగు పెట్టినంతనే ప్రతి ఒక్కరికి ఒకింత ఆవేదనకు గురి చేయటంతో పాటు.. తమ కంటే ముందు తరాల వారి త్యాగాలకు నిలువెత్తు రూపంగా దీన్ని చెప్పొచ్చు. అలానే కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్. అద్భుతమైన నిర్మాణంగా కనిపించే ఇందులో బాధితుల ఘోషలెన్నో బ్రిటీష్ పాలనతో భారతీయ వేదనను గుర్తు చేసే అనుభవాల్ని ఈ గోడలు గుర్తు చేస్తాయి. అందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి. అలానే జైసల్మేర్ లోని కుల్ధారా. ఒక్క రాత్రిలో మాయమైన ఊరు. ఎవరూ తిరిగి రాలేదు. ఎందుకు వెళ్లారో.. ఎక్కడకు వెళ్లారో తెలీదు. అక్కడ అడుగు పెట్టినంతనే ఒకలాంటి అసహజ నిశ్శబ్దం వెంటాడుతుంది.
ఉత్తరాఖండ్ లోని రూప్కండ్ సరస్సు. ఎంతో ఎత్తులో ఉన్న ఈ సరస్సు నీటిలో స్వచ్ఛమైన నీరు తర్వాత.. అక్కడ కనిపించే ఎముకుల గుర్తు భయాన్ని కలిగిస్తాయి. సూరత్ లోని డుమాస్ బీచ్. కృష్ణవర్ణపు ఇసుక, నిశ్శబ్దం నిండిన అలలు... కానీ కొందరికి అక్కడ అడుగుల సవ్వడి వినిపిస్తుంది. దీన్ని బీచ్ అనే కన్నా ఇదో మిస్టరీగా చెప్పొచ్చు. ఇక.. ఫుణె శనివారం వాడా. ఈ ప్రదేశంలో ఏదో మాట ఉందంటారు. కంటికి కనిపించే ఈ కోటలో ఓ ఆత్మఘోష ఉందంటారు. చరిత్రలో మనిషి అనుభవించిన చీకటి కోణాల కథలు. ఇప్పుడు వాటిని తెలుసుకునేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తోంది జనరేషన్ జెడ్. ఇప్పుడు అర్థమైందా డార్క్ టూరిజం లెక్కేంటో?