గల్లా జయదేవ్ యూటర్న్.. దేవుడుపై భారం వేసిన మాజీ ఎంపీ
గుంటూరు మాజీ ఎంపీ, అమరరాజా సంస్థల అధిపతి గల్లా జయదేవ్ యూటర్న్ తీసుకున్నారు.;
గుంటూరు మాజీ ఎంపీ, అమరరాజా సంస్థల అధిపతి గల్లా జయదేవ్ యూటర్న్ తీసుకున్నారు. తన పరిశ్రమ అభివృద్ధి కోసం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఏడాదిన్నర క్రితం జయదేవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించిన జయదేవ్ స్నేహితులు అందరినీ పిలిచి విందు ఇచ్చి రాజకీయాల నుంచి వీడ్కోలు తీసుకున్నారు. అయితే ఆ సమయంలోనే భవిష్యత్తులో మళ్లీ అవసరం అనుకుంటే తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ కు వస్తానని వెల్లడించారు. కానీ, ఇంత తక్కువ సమయంలో కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఆయన మనసు మార్చుకోవడం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా కాణిపాకంలో వినాయకుడిని దర్శించుకున్న జయదేవ్ గల్లా.. దేవుడు కరుణిస్తే మళ్లీ టీడీపీలో జాయిన్ అవుతానని ప్రకటించారు.
తాను తిరిగి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు పార్టీ అధిష్టానంతో చర్చిస్తున్నట్లు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. 2014లో తొలిసారి ఎంపీగా గెలిచిన జయదేవ్.. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా సాగినా, గుంటూరులో మాత్రం తిరుగులేని ఆధిక్యంతో గెలిచారు. అయితే ఏడాదిన్నర క్రితం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన జయదేవ్.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే ప్రత్యక్షంగా ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనకపోయినా, టీడీపీ హైకమాండుకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా సేవ చేస్తున్నారని అంటున్నారు. దీంతో ఆయన రాజకీయ పునరాగమనంపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది.
ఇంతలో ఆయనే స్వయంగా తన రీ ఎంట్రీపై ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన జయదేవ్.. ఈ సారి రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నట్లు మీడియాకు వెల్లడించారు. ‘దేవుడు కరుణిస్తే మళ్లీ రాజకీయాలకు వస్తా.. రాజ్యసభకు వెళతా’ అంటూ ఆయన కాణిపాకంలో ప్రకటించారు. తన రీ ఎంట్రీపై టీడీపీ అధిష్టానంతో సంప్రదింపులు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జయదేవ్ తిరిగి టీడీపీలో యాక్టివ్ అవ్వడంపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం కాదని అంటున్నారు. ఆయన ఖాళీ చేసిన స్థానంలో ప్రస్తుతం గుంటూరు ఎంపీగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే జయదేవ్ కు మళ్లీ పార్లమెంటుకు పోటీచేసే ఆలోచన లేదని, అందుకే రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారని అంటున్నారు.
రెండు సార్లు ఎంపీగా గెలిచిన జయదేవ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి. పార్లమెంటులో తన వాగ్దాటితో గుర్తింపు తెచ్చుకున్న జయదేవ్ ప్రజల్లోనూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటారని కూడా చెబుతారు. దీంతో జయదేవ్ కి టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అంటున్నారు. కాకపోతే రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన కోరుకోవడంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సివుందని అంటున్నారు. ప్రస్తుతానికి ఏపీ నుంచి రాజ్యసభ స్థానాలు ఏవీ ఖాళీగా లేవు. మరో ఏడాది తర్వాతే రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జయదేవ్ రీ ఎంట్రీ ఎప్పుడో చూడాల్సివుంది.