ఆగస్టు 15 వస్తోంది.. భర్త లారా జాగ్రత్త!
ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మహిళల ఉచిత ప్రయాణ పథకంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.;
ఆగస్టు 15.. మన జాతీయ పండుగ. వాడవాడలా మువ్వెన్నల జెండా ఎగరేసి కుల, మతాలకు అతీతంగా వేడుక చేసుకునే స్వాతంత్ర్య దినోత్సవం. అలాంటి ఆగస్టు 15న ఏపీలో ఈ సారి ఇంకా ఘనంగా సెలబ్రెట్ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల హామీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆ రోజునే ప్రారంభిస్తోంది. అటు జాతీయ పండుగ, ఇటు మహిళల కోసం కూటమి ప్రభుత్వం ఇస్తున్న కానుకతో ఆ రోజు అంతా పండగే అనుకుంటున్నారు. కానీ, భర్తలు మాత్రం ఆ రోజు నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు.
ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మహిళల ఉచిత ప్రయాణ పథకంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో నిర్వహించిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన మహిళలకు భరోసా ఇచ్చేలా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ‘ఇకపై భర్త ఏమైనా అంటే ఫ్రీ బస్సులో పుట్టింటికి వెళ్లిపోండి.. వాళ్లే చార్జీలు పెట్టుకుని వచ్చి మళ్లీ తీసుకువెళ్తారు’ అంటూ వ్యాఖ్యానించి అగ్గి రాజేశారు వెంకట రాజు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాన్ని ప్రచారం చేసేందుకు మహిళలను ఆకట్టుకునేందుకు ఆయన అలా మట్లాడినా, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కుటుంబాల్లో చిచ్చు రేపేలా వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉచిత ప్రయాణ పథకంపై విపక్షాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు విధిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆటో డ్రైవర్లు తమ ఉపాధి దెబ్బ తింటుందని టెన్షన్ పడుతున్నారు. దీనికి అదనంగా భర్తలు భయపడేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీస్తోంది.