రీల్ కాదు రియల్: కడప పోలీస్ స్టేషన్ కు వచ్చి తీసుకెళ్లిన అంజాద్ బాషా
రీల్ లో మాత్రమే కనిపించే సీన్ రియల్ సీన్ గా మారిపోయింది. దీనికి సంబంధించిన క్రెడిట్ మొత్తం ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకే దక్కుతుంది.;
రీల్ లో మాత్రమే కనిపించే సీన్ రియల్ సీన్ గా మారిపోయింది. దీనికి సంబంధించిన క్రెడిట్ మొత్తం ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకే దక్కుతుంది. అతగాడి రుబాబు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సినిమాల్లో తన వాళ్లను పోలీస్ స్టేషన్ లో ఉంచితే.. పోలీసులకు షాకిచ్చేలా తన వాడిని స్టేషన్ నుంచి తీసుకెళ్లే సీన్లు చాలానే చూసి ఉంటారు. తాజాగా అచ్చు అలాంటి రీల్ సీన్ ను రియల్ గా చేసి చూపించారు. అసలేం జరిగిందంటే?
కడప పట్టణంలోని రాజారెడ్డి వీధిలో బడ్డాయపల్లెకు చెందిన పలువురు మహిళల వద్ద మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి రూ. 50 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పును గడిచిన పదమూడేళ్లుగా తిరిగి చెల్లించలేదు. ప్రస్తుతం అతడు అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇటీవల అప్పు ఇచ్చిన మహిళలు మహేశ్వర్ రెడ్డి వద్దకు వెళ్లి.. తాము ఇచ్చిన అప్పు డబ్బుల్ని వెంటనే తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో.. తాను ఇబ్రహీం అనే వ్యక్తికి అప్పు ఇచ్చానని.. అతడు తనకు ఇవ్వటం లేదని చెప్పారు.
దీంతో అతడి కోసం మహిళలు గాలింపు మొదలు పెట్టారు. శుక్రవారం అతను పాత బస్టాండ్ వద్ద కనిపించటంతో అతడ్ని నిలదీశారు. వాగ్వాదం అనంతరం అతడికి దేశశుద్ది చేసి కడప ఒకటో పట్టణ పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు అనుచరుడు. దీంతో.. పోలీస్ స్టేషన్ కు వచ్చిన అంజాద్ బాషా తన మద్దతుదారును స్టేషన్ కు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించి.. తనతో అతడ్ని తీసుకెళ్లిపోయారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు.
ఈ విషయం తెలుసుకున్న మహిళలు.. అంజాద్ బాషా ఇంటికి వెళ్లి నిరసన చేపట్టారు. వారితోనూ వాగ్వాదానికి దిగారు అంజాద్ బాషా. స్టేషన్ కు వచ్చి తన వర్గీయుడ్ని బలవంతంగా తీసుకెళ్లినా పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్పించి.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని తప్పు పడుతున్నారు. ఈ అంశంపై ఇరు వర్గాలు ఫిర్యాదులు ఇవ్వటంతో.. ఇరువురు మీదా పోలీసులు కేసులు నమోదు చేయటం గమనార్హం. స్టేషన్ కు వచ్చి తన వర్గీయుడ్ని తీసుకెళ్లిపోయిన వైనం కడపలో సంచలనంగా మారింది. పోలీసుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి.. ఈ ఇష్యూపై ఏపీ హోం మంత్రి అనిత ఎలా రియాక్టు అవుతారో చూడాలి.