‘పిచ్చి ప్రచారాలు మానండి.. ఆ పార్టీలో చేరితే డిప్యూటీ సీఎం అయ్యేవాడ్ని’
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరగటం.. ఇటీవల కరీంనగర్ లో పోస్టర్లు వేయటం లాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన మాట్లాడారు.;
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరగటం.. ఇటీవల కరీంనగర్ లో పోస్టర్లు వేయటం లాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతన్న ప్రచారాన్ని పిచ్చి ప్రచారంగా తేల్చేసిన ఆయన.. అలాంటివి ఆపేయాలన్నారు.
ఎలాంటి తప్పు చేయకున్నా.. మెడలు పట్టి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ లోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్నారంటూ.. ‘‘పార్టీ మారే పరిస్థితి లేదు. పార్టీలు మారటం దుస్తులు మార్చినంత సులువు కాదు. నన్ను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేశారు. అధికార బలంతో వ్యక్తిగతంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడేమో ఈటల పార్టీ మారుతున్నారంటూ పోస్టర్లు వేస్తారా?’ అంటూ ప్రశ్నించారు.
కొందరు తాను పార్టీ మారుతున్నట్లుగా పోస్టర్లు వేయటం బాధించిందన్న ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బీజేపీ నుంచి మారే పరిస్థితే లేదన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన అంశాల్నిసైతం ప్రస్తావించారు. ‘‘నన్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీలోకి రావాలని అనాడు ఆహ్వానించారు. అంతేకాదు కోరుకున్న మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. కానీ.. కమిట్ మెంట్ తో ఉద్యమంలోనూ కొనసాగాను’’ అంటూ తనది ఎంత బలమైన కమిట్ మెంట్ అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంచేశారు.
అందరి అజెండా కేసీఆర్ ను ఓడించటమే కాబట్టి.. రాజగోపాల్ రెడ్డి.. తుమ్మల.. జూపల్లి.. వివేక్ లాంటి వాళ్లంతా కాంగ్రెస్ లోకి వెళదామన్నారంటూ నాటి ముచ్చట్లు చెప్పిన ఈటల.. ‘‘ఒకవేళ కాంగ్రెస్ లోకి పోయి ఉంటే మంత్రినో.. డిప్యూటీ సీఎంనో అయ్యేవాడిని’’ అంటూ వ్యాఖ్యానించారు. తనను కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి బయటకు పంపి ఐదేళ్లు అవుతుందని.. అప్పుడు తాను బీజేపీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలు మారకూడదని తానే సందేశాన్ని ఇచ్చానని.. పాతికేళ్లు బీఆర్ఎస్ లో ఉన్నానని.. అందుకే తనకు అత్యధిక పరిచయాలు..తనను అభిమానించే వారు బీఆర్ఎస్ లో ఉన్నారన్నారు. ఈటలను పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అన్నారని.. దీనిపై పెద్ద చర్చ జరుగుతోందన్నారు. మళ్లీ కేసీఆర్ తో కలుస్తానని చెబుతున్నారని.. అలాంటి పిచ్చి ప్రచారాలు ఆపాలని ఈటల కోరారు.