డోజ్‌ను బౌద్ధంతో పోల్చిన మస్క్.. తాను తప్పుకున్నా ఆగదట
జూలై 2026 నాటికి ప్రభుత్వ ఖర్చుల్లో ఒక ట్రిలియన్ డాలర్లు తగ్గించాలనేది డోజ్ లక్ష్యమని మస్క్ చెప్పాడు.;
అమెరికా ప్రభుత్వంలో మార్పులు తీసుకు వచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన 'డోజ్' నుంచి ఎలాన్ మస్క్ ఈ నెలాఖరుకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. దీని గురించి తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాట్లాడాడు. డోజ్‌ను బౌద్ధమతంతో పోలుస్తూ, తాను లేకపోయినా అది తన దారిలో తాను పోతుందని చెప్పాడు. ట్రంప్ పరిపాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్టాడారు ట్రంప్. ఆ సమయంలో మస్క్ లేకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) నడుస్తుందా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మస్క్ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు.
"డోజ్ అనేది ఒక బౌద్ధమతం లాంటిది. అది ఒక జీవన విధానం. బుద్ధుడు లేకపోయినా బౌద్ధమతం ఎలా నడుస్తుందో, నేను లేకపోయినా డోజ్ కూడా అలాగే నడుస్తుంది" అని ఎలాన్ మస్క్ అన్నాడు. తర్వాత దానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అని విలేకరులు అడగ్గా, "అది ముందుకు సాగడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తి అక్కర్లేదు. బుద్ధుడి తర్వాత బౌద్ధమతం మరింత బలపడలేదా?" అని ఎదురు ప్రశ్నించాడు. తాను లేకపోయినా ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డోజ్ పనిచేస్తూనే ఉంటుందని చెప్పాడు. తొలగింపు చర్యల్లో భాగంగా ఫెడరల్ ప్రభుత్వంలో కొంతమంది ముఖ్య ఉద్యోగులు వెళ్లిపోయిన విషయాన్ని ఆయన ఒప్పుకున్నాడు.
జూలై 2026 నాటికి ప్రభుత్వ ఖర్చుల్లో ఒక ట్రిలియన్ డాలర్లు తగ్గించాలనేది డోజ్ లక్ష్యమని మస్క్ చెప్పాడు. ఇప్పటివరకు 160 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకున్నామన్నాడు. డోజ్ పవర్ తగ్గిపోతుందా అని అడిగితే, అలాంటిదేమీ లేదని, దాని పనులు మరింత ఊపందుకుంటాయని తాను భావిస్తున్నానని చెప్పాడు. ప్రభుత్వ వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకురావడం, శాఖల్లో అనవసరమైన ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలో 'డోజ్' ఏర్పడింది. సంస్కరణల్లో భాగంగా చాలా శాఖల్లో వేల మంది ఉద్యోగులను తీసేశారు. ఈ విషయంలో మస్క్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రంప్ పరిపాలనను వెనుక ఉండి ఆయనే నడిపిస్తున్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ డోజ్‌లో మస్క్ కేవలం సలహాదారు మాత్రమేనని ఆయనకు ఎలాంటి నిర్ణయాధికారాలు లేవని వైట్‌హౌస్ ఇదివరకే స్పష్టం చేసింది.