భాష విషయంలో పార్టీలకు కొత్త టాస్క్... ఈసీ సూచనలు ఇవే!

ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులు వాడుతున్న భాష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

Update: 2023-12-21 14:04 GMT

ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులు వాడుతున్న భాష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో సమర్ధనలో భాగంగా... వారు అన్నారు కాబట్టి తాము అన్నాము అనే చర్చ కోడి ముంద గుడ్డు ముందా అనే ప్రశ్నలానే ఉంటుంది. ఈ సందర్భంగా సమాజంలోని పలు విషయాలపై వారు ప్రయోగిస్తున్న పదప్రయోగాల విషయంలో తాజాగా ఎన్నికల కమిషన్ పలు సూచనలు చేసింది.

అవును... రాజకీయ నాయకులు ఉపయోగించే భాష విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కీలక సూచనలు చేసింది. ఇందులో భాగంగా ప్రధానంగా దివ్యాంగుల వైకల్యాన్ని తెలియజేసే పదాలను వీలైనంత వరకు ఉపయోగించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో... పాగల్‌, మూగ, సిర్ఫిరా, గుడ్డి, చెవిటి, కుంటి, అంధ వంటి పదాలను నేతలు వాడకుండా ఉండాలని ఎన్నికల కమిషన్ సూచించింది.

ఈ సందర్భంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో... రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి పదాలు నిషేధించాల్సిన ఆవశ్యకత ఉందని, ఇది అవమానకరమైన భాష అని గ్రహించి అన్ని పార్టీలు సహకరించాలని, ఈ మేరకు తమ తమ నేతలకు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. ఇదే సమయంలో... అన్ని రాజకీయ పార్టీలు తమ వెబ్‌ సైట్‌ లో వైకల్యం విషయంలో సున్నితమైన భాషను మాత్రమే మాట్లాడతామని నిర్ధారించుకుంటున్నట్లు ప్రకటించాలని ఆదేశించింది.

ఈ క్రమంలో ప్రధానంగా రాజకీయ ప్రసంగాల్లో దివ్యాంగులకు న్యాయం, గౌరవం కల్పించాలని స్పష్టం చేసిన ఈసీ... రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు తమ మాటల్లో, రచనల్లో, ప్రచారంలో... ఎటువంటి అవమానకరమైన పదాలు ఉపయోగించ కూడదని తెలిపింది. అదేవిధంగా... రాజకీయ పార్టీలు, నేతలు.. వికలాంగుల వైకల్యానికి సంబంధించిన వ్యాఖ్యలను ఖచ్చితంగా నివారించాల.. అవి పక్షపాతాలను శాశ్వతం చేస్తున్నాయని అభిప్రాయపడింది.

Read more!

ఇలా ప్రసంగాలలోనే కాకుండా... ప్రకటనలు, పత్రికా ప్రకటనలతో సహా సోషల్ మీడియా పోస్ట్‌ లలోనూ వికలాంగుల పట్ల అసహ్యకరమైన, అభ్యంతరకరమైనా లేదా వివక్షతతో కూడిన పదాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి రాజకీయ పార్టీలు అంతర్గత సమీక్ష ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ తాజాగా పేర్కొంది.

సీఈసీ, ఈసీ ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం!:

మరోపక్క ఈ రోజు పార్లమెంటులో ఎన్నికల కమిషన్ కు సంబంధించిన కీలక బిల్లుకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా... ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలను నియంత్రించడంతోపాటు వారి సర్వీసులకు నిబంధనలు రూపొందించే బిల్లు... "ది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్మెంట్‌, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు - 2023"కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

వాస్తవానికి ఇప్పటివరకు సీఈసీ, ఈసీలను ప్రభుత్వమే నియమించేది. అయితే... తాజా బిల్లు ప్రకారం.. ఇక నుంచీ సెర్చ్‌, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించనున్నాయి.

Tags:    

Similar News