పాత కేసు బూజు దులిపిన ప్రభుత్వం.. కొడాలి నాని ప్రాసిక్యూషన్ కు కదిలిన ఫైల్!
ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, గుడివాడకు చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోంది.
ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, గుడివాడకు చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి ప్రభుత్వం ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నమోదైన ఒక పాత కేసును ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 2021లో ఎన్నికల సంఘంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చింది. అప్పట్లో ఆ ఫైల్ అటకెక్కినా, ఇప్పుడు సర్కారు బయటకు తీసిందని చెబుతున్నారు. దీంతో మాజీ మంత్రి కొడాలి ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఈ తాజా పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఎన్నికల సంఘంపై విమర్శలు
2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో, ఎన్నికల సంఘంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను కించపరిచేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన మాటలు ఉన్నాయని అప్పట్లోనే ఫిర్యాదులు అందాయి. అయితే, అప్పట్లో ఆయన రాష్ట్ర మంత్రిగా ఉండటం, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఆ కేసు దర్యాప్తు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదని అంటున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారడంతో కొడాలికి కష్టాలు మొదలైనట్లేనా అని విశ్లేషకులు భావిస్తున్నారు.
మెయిన్ టార్గెట్ నాని
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వెలికితీసే క్రమంలో కొడాలి నానిపై చర్యలకు తీవ్ర ఒత్తిడి వచ్చిందని అంటున్నారు. కొడాలి నాని దూకుడు భాష, టీడీపీ అధినాయకత్వంపై ఆయన చేసే వ్యక్తిగత విమర్శలతో ఆయనను అరెస్టు చేయాలని ప్రభుత్వంపై టీడీపీ కూటమి కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి చేశారు. అయితే కొన్ని కేసుల్లో ఆయనకు బెయిలు రావడం, మరోవైపు అనారోగ్యానికి గురికావడం కూటమి ప్రభుత్వం కొడాలి ఫైలును తాత్కాలికంగా పక్కన పెట్టిందని చెబుతున్నారు. అయితే ఇటీవల కొడాలి తిరిగి యాక్టివ్ అవుతున్నారనే సంకేతాలు అందుతుండటంతో ఈ పాత కేసును బూజు దులిపి మరీ తెరపైకి తెచ్చారని అంటున్నారు.
పాత వైరం.. కొత్త మలుపు
కొడాలి నానిపై ఇప్పటికీ టీడీపీ కేడర్ గుర్రుగా ఉందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ను వ్యక్తిగతంగా దూషించిన కొడాలి వ్యవహారాన్ని కూటమి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు దొరుకుతారా? అని ప్రభుత్వ పెద్దలు ఎదురుచూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పాత కేసు వెలుగు చూడటం, గత ప్రభుత్వంలోనే నమోదైన కేసులో కొడాలిపై చర్యలకు సిద్ధమవడంతో ప్రభుత్వ పెద్దలు పెద్ద ఆలోచనతోనే ఫైల్ నడుపుతున్నారని అనుమానిస్తున్నారు. మొత్తానికి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ మొదలైతే, అది ఆయన రాజకీయ భవితవ్యాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే ఆసక్తి నెలకొంది. కేసులు, చట్టపరమైన చిక్కులతో ఆయనను రాజకీయంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.