7,000 చదరపు అడుగుల్లో రూ.7 కోట్ల ఇళ్లు... ఎవరీ కానిస్టేబుల్..!
కోట్లాది రూపాయల కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ రాకెట్ ఎంత సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే.;
కోట్లాది రూపాయల కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ రాకెట్ ఎంత సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది. ఈ సమయంలో ఇప్పటికే పోలీసులు కస్టడీలో ఉన్న కీలక నిందితులను మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం పరిశీలించడానికి వారెంట్ ను కోరినట్లు తెలుస్తోంది! ఈ సమయంలో పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి.
అవును... తీవ్ర సంచలనం సృష్టించిన కోడైన్ ఆధారిత దగ్గు సిరప్ రాకెట్ లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు శుభం జైస్వాల్ తండ్రి భోలా ప్రసాద్ తో పాటు.. అతని తర్వాత సిండికేట్ కు రక్షణ, లాజిస్టికల్ సహాయం అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు కానిస్టేబుల్ అలోక్ ప్రతాప్ సింగ్ ను ఈడీ కస్టడీ విచారణకు పంపుతోంది. ఈ సమయంలో సదరు కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ఒక్కసారిగా షాకయ్యారంట.
7,000 చదరపు అడుగుల్లో రూ.7 కోట్ల ఇళ్లు!:
లక్నో - సుల్తాన్ పూర్ హైవే సమీపంలోని అలోక్ ప్రతాప్ సింగ్ రెండు అంతస్తుల భవనంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ సమయంలో ఈ మాజీ కానిస్టేబుల్ కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంపద చూసి దర్యాప్తు అధికారులు అవాక్కైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంట్లో అలంకరించబడిన విధానం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.
ఇందులో భాగంగా... యూరోపియన్ శైలి ఇంటీరియర్స్, ఎత్తైన స్తంభాలు, స్పైరల్ మెట్లు, వింటేజ్ లైటింగ్, ఖరీదైన వస్తువులు ఆ ఇంట్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ రాకెట్ కి సంబంధించిన ఈడీ అధికారుల దర్యాప్తులో ఈ బిల్డింగ్ కేంద్ర బిందువుగా మారిందని అంటున్నారు! ఈ బిల్డింగ్ ఖరీదు సుమారు రూ.7 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.
అలా బయటపడిన అలోక్ వ్యవహారం!:
అత్యంత కీలకమైన ఈ కేసులో మరో నిందితుడు అమిత్ కుమార్ సింగ్ అలియాస్ అమిత్ టాటాను విచారిస్తున్న సమయంలో అనూహ్యంగా అలోక్ ప్రతాప్ సింగ్ వ్యవహారం బయటపడిందని చెబుతున్నారు. దీంతో.. యూపీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతన్ని అరెస్టు చేసింది. ఈ క్రమంలో.. ప్రస్తుతం లక్నో జైల్లో ఉన్న అలోక్.. యూపీ, జార్ఖండ్ లలో హోల్ సేల్ దగ్గు సిరప్ యూనిట్లను నిర్వహిస్తున్న నెట్ వర్క్ లో కీలక పాత్ర పోషించాడని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.
కానిస్టేబుల్ టు సిండికేట్ మెంబర్!:
వాస్తవానికి అలోక్ పోలీస్ కెరీర్ తొలి నుంచీ వివాదాస్పదంగానే మారిందని అంటున్నారు. ఇందులో భాగంగా... నాలుగు కేజీల బంగారాన్ని దోచుకున్న కేసులో ఆయనను మొదట 2006లో అరెస్టు చేసి, విధుల నుంచి తొలగించారు. అయితే.. ఆ కేసులో నిర్దోషిగా బయటపడటంతో మళ్ళీ విధుల్లో చేరాడు. ఈ క్రమంలో 2019లో మరో ఆరోపణలపై మళ్లీ తొలగించారు. ఈ క్రమంలో చివరికి దగ్గు సిరప్ సిండికెట్ తో సంబంధాలు పెట్టుకుని, అందులో కీలకంగా మారాడని అధికారులు చెబుతున్నారు.