వైసీపీలోకి దువ్వాడ రీ ఎంట్రీ... రీజన్ అదే ?
దువ్వాడ శ్రీనివాస్ ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఆయన ఫైర్ బ్రాండ్.;
దువ్వాడ శ్రీనివాస్ ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఆయన ఫైర్ బ్రాండ్. అదే ఆయనను రాజకీయంగా ఈ స్థాయికి చేర్చింది అని అంటారు. జెడ్పీటీసీ గా కాంగ్రెస్ లో గెలిచి కొంతకాలం జెడ్పీ వైఎస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన దువ్వాడ ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన 2014 , 2019, 2024 లలో వైసీపీ నుంచి రెండు సార్లు టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఒకసారి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. జగన్ కి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన దువ్వాడ అయిదేళ్ళ వైసీపీ హయాంలో తహ హవా బాగా చాటారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి చట్ట సభకు పంపిన ఘనత జగన్ దే.
జగన్ గ్రేట్ అంటూ :
ఆ మధ్య వ్యక్తిగత వివాదాల నేపధ్యంలో ఆయనను వైసీపీ అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే తన సస్పెషన్ వెనక జిల్లాకు చెందిన కీలక నేతలు ఉన్నారని ఇటీవలనే దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని అణచేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కి మద్దతు ప్రకటించారు. మరో వైపు జగన్ తనకు దేవుడు అని ఆయన తన గుండెలలో ఉన్నారని దువ్వాడ చేస్తున్న కామెంట్స్ చూసిన వారు ఆయన వైసీపీలోకి తొందరలోనే రీ ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు.
బలమైన నేతగా :
శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన వ్యక్తిగత వివాదం కూడా ఇటీవల కాలంలో చల్లారిపోయింది. దాంతో ఆయన మీద వేసిన సస్పెన్షన్ వేటుని అధినాయకత్వం ఉప సంహరించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీకి జిల్లాలో ధీటైన నేతల కరవు ఉంది. టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉంది. అక్కడ కింజరాపు కుటుంబం హవా ఎక్కువగా ఉంటుంది. వారిని ఎదిరించి రాజకీయం చేయడం అంటే వైసీపీలో ఉన్న నేతలకు సాధ్యం కావడం లేదని అంటున్నారు. సామాజిక కోణంలో కొందరు వైసీపీ నేతలు లోపాయికారీగా రాజీ పడుతున్నారు అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఆదరించి కీలక పదవులు కట్టబెట్టినా పార్టీ ఓటమి చెందిన వేళ ముఖ్య నాయకులు మౌన ముద్ర దాల్చడం పట్ల వైసీపీ హై కమాండ్ సీరియస్ గానే ఉంది అని అంటున్నారు. జిల్లాలో ఎంత చేసినా ఆ సామాజిక వర్గం దన్ను ఎక్కువగా టీడీపీకే ఉంటుంది అన్న లెక్క కూడా వేసుకుంటోంది అని అంటున్నారు. దాంతో సరికొత్త సామాజిక కూర్పుతో ముందుకు వెళ్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆలోచిస్తున్నారని అంటున్నారు.
ఆ ఎన్నికల నాటికి :
ఇక వైసీపీలోకి దువ్వాడ శ్రీనివాస్ రీ ఎంట్రీ ఇపుడే ఉంటుందా లేక కొంత కాలం ఆగి ఉంటుందా అన్నది కూడా చర్చ సాగుతోంది. అయితే 2029 లో మాత్రం వైసీపీ నుంచే దువ్వాడ పోటీ చేస్తారని అది కూడా టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కలి నుంచే పోటీకి దిగుతారు అని అంటున్నారు. ఇక వైసీపీ కూడా రానున్న రోజులలో జిల్లలో ప్రక్షాళన కార్యక్రమం చేపడుతుందని అంటున్నారు. పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని దూకుడుగా రాజకీయం చేసే వారినే ప్రోత్సహించాలని అనుకుంటోంది అని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో దువ్వాడ రీ ఎంట్రీ కూడా చర్చకు వస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజానిజాలు ఏమిటి అన్నది.