వైసీపీలోకి రీఎంట్రీ.. దువ్వాడ ఆశలపై నీళ్లు!

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడింది.

Update: 2026-08-19 10:30 GMT

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒకవైపు అధికార టీడీపీ నేతలపై, ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడిపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతూ మళ్లీ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొడుతున్నాయి. ఫ్యాన్ గాలిలో మళ్లీ చక్రం తిప్పాలని ఆయన చేస్తున్న సర్కస్ విన్సెంట్లపై వైసీపీ పెద్దలు నీళ్లు చల్లినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ పునరాగమనం వెనుక ప్రధాన అడ్డంకిగా ఆయన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు మారాయి. గడచిన కాలంలో ఆయన కుటుంబ వివాదాలు రోడ్డెక్కిన తీరు, మీడియా సాక్షిగా నడిచిన వీధి నాటకాలు ఆయన ప్రతిష్ఠను దారుణంగా దిగజార్చాయి. ప్రజా జీవితంలో ఉన్న నేత ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం పార్టీకి తీవ్ర మచ్చగా మారుతుందని, మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఒక వర్గం గట్టిగా భావిస్తోంది.

వ్యక్తిగత వివాదాలతో పాటు ఆయన రాజకీయం శైలి కూడా పార్టీలో ఒంటరి చేసేసింది. జిల్లాలోని ఏ ఒక్క ప్రధాన సీనియర్ నేతతోనూ ఆయనకు సత్సంబంధాలు లేవు. ఎవరి మాట వినకుండా, ఎవరితోనూ సమన్వయం చేసుకోకుండా సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లే నైజం ఆయనను మరింత ఏకాకిని చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం రాజకీయాల్లో బలమైన స్థానం ఉన్న ధర్మాన బ్రదర్స్‌తో పాటు ఇతర కీలక నేతలకు కూడా దువ్వాడతో పడదనే టాక్ ఎప్పటినుంచో ఉంది.

ఇలాంటి నేపథ్యంలో దువ్వాడను మళ్లీ పార్టీలోకి తెచ్చి నెత్తికెత్తుకుంటే, ఉన్న సీనియర్ నేతలు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యే ప్రమాదముంది. ఒక వివాదాస్పద నేత కోసం పార్టీలో సమన్వయాన్ని కోల్పోలేమని భావించిన అధిష్టానం.. ఆయన ఆవేశపూరిత విమర్శలను, హడావుడిని పూర్తిగా లైట్ తీసుకుంది. దువ్వాడ పోరాటాలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదనే కఠిన సందేశాన్ని పంపడం ద్వారా ఆయన రీఎంట్రీకి పూర్తిగా చెక్ పెట్టినట్లు స్పష్టమవుతోంది.

మొత్తంగా చూస్తే, దువ్వాడ శ్రీనివాస్ ఎంతగా గొంతుచించుకుని గళం విప్పినా, గడచిన కాలపు వివాదాలు ఆయన రాజకీయ జీవితానికి పెద్ద శాపంగా మారాయి. వైసీపీ తలుపులు పూర్తిగా మూసుకుపోయిన ఈ తరుణంలో ఆయన ఆశలన్నీ ఆవిరైపోయాయి. భవిష్యత్తులో ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని ఏ దిశగా నడిపిస్తారనేది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News