భారతీయులకు ట్రంప్ స్నేహితుడేనా?
స్నేహితుడంటే? స్నేహమంటే? భారత ప్రధాని నరేంద్ర మోడీ నాకు చాలా మంచి మిత్రుడు అంటూ తరచూ చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఇప్పుడు జుట్టు పట్టుకొని పీక్కునేలా మారింది.;
స్నేహితుడంటే? స్నేహమంటే? భారత ప్రధాని నరేంద్ర మోడీ నాకు చాలా మంచి మిత్రుడు అంటూ తరచూ చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఇప్పుడు జుట్టు పట్టుకొని పీక్కునేలా మారింది. ఎందుకంటే.. అతను భారతీయులకు అనుకూలమా? ప్రతికూలమా? అతను తీసుకునే నిర్ణయాలు భారత్ కు మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? స్నేహితుడు.. మిత్రదేశం అన్న మాటలే తప్పించి.. చేతల విషయానికి వస్తే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ధోరణి ఇప్పుడో తలనొప్పిగా మారింది.
పహల్గాం ఉగ్రదాడి సందర్భంలోనూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ భారత్ - పాకిస్తాన్ ను ఒకే గాటున కట్టేసిన వైనం చాలామంది భారతీయుల్ని హర్ట్ అయ్యేలా చేసింది. తరచూ భారత్ కు తాను మిత్రుడినని చెప్పే ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నట్లు? ఆ మాటకు వస్తే ఆపరేషన్ సిందూర్ ను ప్రత్యేకంగా చూడాలని.. భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న కఠిన చర్యలకు తమ మద్దతు ఉంటుందన్న విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయాడు? భారత్ - పాక్ రెండూ తమకు ముఖ్యమైన దేశాలుగా పేర్కొనటం ద్వారా.. భారతీయులకు షాకిచ్చారు.
అలా అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్లినప్పుడు..ఆయనకు అతిధ్యం ఇచ్చే విషయంలోనూ.. గౌరవ మర్యాదల్ని ప్రదర్శించే ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవటం కనిపిస్తుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సందర్భంలో మోడీకి ఘన స్వాగతం పలికిన ట్రంప్.. ఒప్పందాలు చేసే సమయంలో మోడీ కుర్చీ లాగి మరీ ఆయన్ను కూర్చోబెట్టారు.
ఈ సన్నివేశాన్ని చూసినోళ్లంతా.. ట్రంప్ కారణంగా భారత వాణిజ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ.. కొద్ది రోజులకే పరస్పర సుంకాల వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించటం ద్వారా షాకిచ్చారు. ఏప్రిల్ 4న భారత్ పైనా 26 శాతం సుంకాల్ని ప్రతిపాదించారు. దీంతో మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. వారం తర్వాత సుంకాల్ని నిలిపి వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించటం.. ఇందుకు 90 రోజుల విరామాన్ని ప్రకటించారు. ఆ సమయంలో సంప్రదింపులు జరుపుతాయని ప్రకటించారు.
భారత్ తమకు ప్రయారిటీ అని.. ఆ దేశంతో వాణిజ్యం కీలకమని చెబుతూనే.. ఐఫోన్ తయారీని భారత్ నుంచి అమెరికాకు తరలించాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ కు సూచించటం తెలిసిందే. వాణిజ్యయుద్ధంలో భాగంగా చైనాపై ట్రంప్ భారీ సుంకాలు వేశారు. దీంతో అక్కడ తయారు చేసిన ఐఫోన్లను దిగుమతి చేసుకోవటం అమెరికాకు భారంగా మారనుంది. ఈ క్రమంలో చైనా నుంచి ఫోన్ల తయారీని భారత్ కు తరలించాలని యాపిల్ డిసైడ్ అయ్యింది. ఇలాంటి వేళలోనే ట్రంప్ బాంబ్ పేల్చి.. యాపిల్ ఉత్పత్తి కేంద్రాన్ని అమెరికాలో పెట్టాలని చెప్పినట్లుగా ట్రంప్ చెప్పుకొచ్చారు.
ట్రంప్ మాటలతో తమకు సంబంధం లేదని.. భారత్ లోనే ఐఫోన్ల తయారీ యూనిట్ల కార్యకలాపాలు కొనసాగిస్తామని యాపిల్ ప్రకటించింది. ఇలాంటి వేళ.. ట్రంప్ తీరు భారత్ కు ప్రతికూలంగా ఉంటున్నాయన్న వాదనకు బలం చేకూరుతోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కు ఐఎఫ్ఎం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఆపేయాలని భారత్ కోరింది. కానీ.. పాకిస్తాన్ 7 బిలియన్ డాలర్లు అడిగితే.. తొలి విడతగా ఒక బిలియన్ డాలర్లు ఐఎఫ్ఎం ఇవ్వటం తెలిసిందే. అమెరికా జోక్యం లేకుండా ఈ భారీ నిధుల్ని ఇవ్వటం సాధ్యం కాదన్న విశ్లేషణ వినిపిస్తోంది.
అంతేకాదు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ట్రంప్ వైఖరి మరింత కొత్తగా మారింది. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూతన సోషల్ మీడియా ఫ్లాట్ పాం అయిన ట్రూత్ లో పేర్కొనటమే కాదు.. భారత్ - పాక్ లను.. రెండు దేశాల ప్రధానుల్ని ఒకే గాటున కట్టేయటం చాలామందిని షాక్ కు గురి చేసింది. తాజాగా పాక్ కు తుర్కియే మద్దతుగా డ్రోన్లు.. క్షిపణులు అందచేసిన సంగతి తెలిసిందే. భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆయుధాల్ని పాక్ కు అందిస్తున్న ఆ దేశంతో 304 మిలియన్ డాలర్ల క్షిపణులను అమ్మే ఒప్పందానికి అమెరికా ఓకే చెప్పటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అమెరికాలో అక్రమంగా తిష్ట వేసిన వలసల్ని వారి దేశాలకు తిరిగి పంపించటం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ కు చెందిన పలువురిని అత్యంత అమానుష పద్దతిని ఫాలో కావటంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మిత్రదేశంతో వ్యవహరించే తీరు ఇదేనా? అన్న మాటను పలువురు ట్రంప్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. తాజాగా అమెరికాలోని ప్రవాస భారతీయులు భారత్ లోని తమ తల్లిదండ్రులకు పంపే నిధులపైనా పన్ను విధిస్తామని ప్రకటించారు. ఇటీవల కాలంలో ట్రంప్ నిర్ణయాల్ని చూస్తుంటే.. చైనా.. పాకిస్తాన్ లతో సానుకూలంగా.. భారత్ విషయంలో మాత్రం ప్రతికూలంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ట్రంప్ భారత్ కు నమ్మదగిన స్నేహితుడిగా మాత్రం వ్యవహరించటం లేదని మాత్రం చెప్పక తప్పదు.