ఏమి మాట్లాడుతున్నారు సర్... నరాలు కట్ అయిపోయాయి!!
తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయనే కామెంట్లను సొంతం చేసుకున్నాయి.;
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అత్యంత సహజమే అయినప్పటికీ కొంతమంది నేతలు వారికి మాత్రమే సొంతమైన ఒక ప్రత్యేక జ్ఞానంతో చేసే విమర్శలు ప్రత్యేకంగా ఉంటాయి. అంటే... నవ్వాలో, ఏడవాలో ఆ పార్టీ కార్యకర్తలకు సైతం తెలియనంతగా! ఇక మరికొంతమంది చేసే విమర్శలు, ఆరోపణలు వినగానే... "ఏమి మాట్లాడుతున్నారు సర్... నరాలు కట్ అయిపోయాయి" అనే కౌంటర్ వేయాలనిపిస్తుంది. తాజాగా టీడీపీ నేత దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయనే కామెంట్లను సొంతం చేసుకున్నాయి.
"పోలవరం పూర్తిచేసి 2019 ఎన్నికలకు వెళతాం. రాసుకో.. రాసుకో.. జగన్.. రాసుకో" అంటూ గతంలో అసెంబ్లీలో మంత్రిగా మాట్లాడిన దేవినేని ఉమ.. 2019 ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. మైలవరం ప్రజలు జగన్ కంటే బలంగా రాసుకున్నారో ఏమో కానీ... 12,747 ఓట్ల తేడాతో ఓడించారు! ఆ సంగతి అలా ఉంచితే... వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన ప్రమాణస్వీకారం విశాఖ లోనే అని జగన్ ప్రకటించిన నేపథ్యంలో మరోమారు ఉమ మైకుల ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే జగన్ లండన్ పారిపోతారని. ఇప్పటికే లండన్ చుట్టుపక్కల ఆయన కొన్ని దీవులు కొన్నారని తమకు సమాచారం ఉందని.. ఇదే సమయంలో లండన్ లోని ఒక కంపెనీలో జగన్ 25వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని.. దానికి సంబంధించిన సమాచారం కూడా తమవద్ద ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఉమపై నెట్టింట సెటర్లు పడుతున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు ఎక్కడికి పోతారో చెబుతాము రాసుకో ఉమా రాసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
16 నెలలు జైల్లో పెట్టినప్పుడే వణకలేదు.. 2014లో తన పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నప్పుడే బెదరలేదు.. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడు.. 2024లో మరోసారి అధికారంలోకి వస్తాడు.. అప్పుడు ఎవరు ఎక్కడికి పారిపోతారో అందరం చూద్దాం అంటూ వైసీపీ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈసారి ఉమకు టీడీపీ టిక్కెట్ దక్కితే అది చాలా గొప్పవిషయమని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కామెంట్రీ బాక్స్ లో కుర్చుని కబుర్లు ఎవరైనా చెబుతారు.. గ్రౌండ్ లోకి దిగి సిక్స్ కొట్టేవాడే హీరో అని మరొక కామెంట్!
ఆ సంగతి అలా ఉంటే... గతంలో మంత్రిగా పనిచేసి, 2019 ఎన్నికల్లో వైసీపీ నేత చేతిలో ఓడిపోయిన దేవినేని ఉమ ఈదఫా ఎన్నికల్లో ఎక్కడనుంచి పోటీ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేని సంగతి తెలిసిందే. అదే నియోజకవర్గంలోని వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ తాజాగా టీడీపీలో చేరడం.. ఈసారి టిక్కెట్ ఆయనకే కన్ ఫాం అని, ఉమకు రెస్ట్ అని, ఇది బాబు ఫైనల్ డెసిషన్ అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.