వైసీపీలోకి దేవినేని ఉమా? నిజమేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని పార్టీ మార్పు నిజమేనా? అన్న చర్చ హోరెత్తిపోయింది. అయితే ఈ ప్రచారంపై శుక్రవారం స్పందించారు దేవినేని ఉమా;

Update: 2025-06-27 11:04 GMT

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరనున్నారా? కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో స్పందించారు మాజీ మంత్రి. గత ఎన్నికల్లో పోటీకి చాన్స్ దక్కక, ఏడాదిగా నామినేటెడ్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న ఈ టీడీపీ నేత.. త్వరలో పార్టీ మారనున్నారని, వైసీపీలో చేరిపోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని పార్టీ మార్పు నిజమేనా? అన్న చర్చ హోరెత్తిపోయింది. అయితే ఈ ప్రచారంపై శుక్రవారం స్పందించారు దేవినేని ఉమా.

ఏడాదిగా తిరుగులేని అధికారం చలాయిస్తున్న టీడీపీ కూటమిలో పలువురు సీనియర్లు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమా గతంలో నందిగామ, మైలవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. నందిగామ ఎస్సీ రిజర్వుడు కావడం, మైలవరం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, ఆఖరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో ఉమా పోటీకి దూరంగా ఉండిపోయారు.

అయితే ఎన్నికల అనంతరం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే ఆయన అప్పట్లో వెనక్కి తగ్గారని అంటున్నారు. 2014-19 మధ్య రాష్ట్ర నీటిపారుదల మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా కృష్ణా , గుంటూరు జిల్లాల్లో పార్టీకి వెన్నెముకగా పనిచేశారు. గత ప్రభుత్వంలో వెన్నుచూపని పోరాటం చేసిన ఉమాకు అధికారంలోకి రాగానే పదవి గ్యారెంటీ అన్న ధీమా వ్యక్తమైంది. అయితే రకరకాల సమీకరణాలతో ఉమాకు నామినేటెడ్ పోస్టు కేటాయించడం వాయిదా పడుతూనే ఉంది.

తొలుత ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగితే.. ఆ పదవిని కృష్ణా జిల్లాకే చెందిన సీనియర్ నేత కొనకళ్ల నారాయణకు అప్పగించడంతో ఉమా పేరు వెనక్కి వెళ్లిపోయింది. ఇక రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులకు ఆయన పేరు పరిశీలిస్తున్నారే తప్ప, ఖరారు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉమా టీడీపీని వీడిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దేవినేని కుటుంబానికి టీడీపీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆ బంధాన్ని ఆయన తెంచుకోవాలని నిర్ణయించారన్న ఊహాగానాలు వినిపించడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఈ ప్రచారాన్ని ఉమా దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా సోషల్ మీడియా వేదికగానే స్పందించారు.

తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ మంత్రి ఉమా.. ఆ ప్రచారం ప్రతిపక్షం వైసీపీ కుట్రగా అనుమానించారు. దీంతో ప్రతిపక్ష నేత జగన్ ను ట్యాగ్ చేస్తూ ‘‘ప్రజలు 11 సీట్లతో బుద్ధి చెప్పినా ఫేక్ ప్రచారాలు మానలేదు. నీ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం ఇంతలా దిగజారాలా?’’ అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలన చూసి జగన్ వెన్నులో వణుకు పుడుతోందని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029లోనూ వైసీపీ సింగిల్ సీటు గెలుచుకోవడం కూడా కష్టమేనంటూ హెచ్చరించారు. కాగా, మాజీ మంత్రి ఉమా కౌంటర్ తో ఆయన పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తిదే అన్నట్లు తేలిపోయింది.

Tags:    

Similar News