నాయకులు కావలెను.. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్!
అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది.;
అసెంబ్లీ , పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమాని మునుపెన్నడూ లేని విధంగా నాయకులకు గిరాకీ పెరిగిందని అంటున్నారు. ఏపీలో దాదాపు 88 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో సైతం 50 శాతం సీట్లు పెరుగుతున్నాయి. దీంతో ఆయా స్థానాల్లో జెండా ఎగురవేసే సమర్థులైన నేతల కోసం ప్రధాన పార్టీలన్నీ వేట మొదలుపెట్టాయి.
కొత్త నియోజకవర్గాలు ఏర్పడటం ఒక ఎత్తైతే, అక్కడ ప్రజలను మెప్పించగల అభ్యర్థులను రంగంలోకి దించడం మరో ఎత్తుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం ప్రజాబలం ఉంటే సరిపోదని, పార్టీని నడిపించగల సమర్థతతోపాటు కొన్ని కీలక సమీకరణాలను పార్టీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయని అంటున్నారు. ప్రజలను తమవైపు తిప్పుకోగల నేర్పు, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయగల రాజకీయ చతురత ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. దీంతో ప్రధాన పార్టీలు తమ ప్రత్యర్థులను సైతం ఆకర్షించేలా ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఎన్నికల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని గేలం వేసేలా పార్టీలు అడుగులు వేస్తున్నాయని చెబుతున్నారు. కొత్త నియోజకవర్గాలకు బాధ్యతలు అప్పగించడానికి సొంతంగా ఖర్చు పెట్టుకోగల నాయకుల కోసం పార్టీలు 'రెడ్ కార్పెట్' పరుస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అదేసమయంలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి? ఎవరిని నిలబెడితే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే లెక్కల్లో పార్టీలు అగ్రనాయకత్వాలు దృష్టి పెడుతున్నాయని చెబుతున్నారు.
విపక్షాలకు ఊపిరాడని పరిస్థితి
కాగా, నియోజకవర్గాల పెరుగుదల ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు పెద్ద పరీక్షగా మారిందని అంటున్నారు. ఇప్పటికే ఉన్న స్థానాల్లోనే సరైన అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో, అదనంగా పెరిగిన స్థానాలను భర్తీ చేయడం విపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అంటున్నారు. బలమైన అభ్యర్థులు లేకపోతే అధికార పార్టీ దూకుడును అడ్డుకోవడం అసాధ్యమని విపక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు.
అధికార పార్టీకి 'తయారీ' కష్టాలే!
ఇక అధికార పార్టీకి వనరులు, ఆశావహులు ఉన్నప్పటికీ, కొత్త నేతలను గ్రౌండ్ లెవల్ నుంచి తయారు చేయడం అంత సులువేమీ కాదని విశ్లేషిస్తున్నారు. పాత నేతల మధ్య సమన్వయం కుదర్చడం, కొత్తవారికి టికెట్లు ఇస్తే వచ్చే అసమ్మతిని తట్టుకోవడం వంటి అంతర్గత సమస్యలు అధికార పార్టీకి సవాల్ విసురుతున్నట్లు చెబుతున్నారు. కేవలం గెలుపు గుర్రాలనే నమ్ముకోవాలా లేక పార్టీ కేడర్ నుంచి నాయకులను ప్రోత్సహించాలా అన్న సందిగ్ధాన్ని అధికార పార్టీ ముఖ్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి, పునర్విభజన అనేది రాజకీయ నిరుద్యోగులకు వరంలా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.