మేడం.. మీ గదికి కూడా పేడ పూశాం.. ఏసీ తీసేయండి!
దీంతో కాలేజీకి రాకుండా డుమ్మా కొట్టారు. మరోవైపు.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం .. ఈ విషయంలో జోక్యం చేసుకుంది.;
ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఝాన్సీ లక్ష్మీబాయి కళాశాలలో ``ఆవుపేడ పూతల`` వ్యవహారం కొత్త వివాదానికి తెరదీసింది. సాక్షాత్తూ ప్రిన్సిపాల్.. డాక్టర్ ప్రత్యూష్ వత్సల విద్యార్థుల తరగతి గదుల కు ఆవు పేడతో పూత పూసి.. సంచలనం రేపిన విషయం తెలిసిందే. విద్యార్థుల కోసమేతాను చేశానని.. ప్రస్తుతం వేసవి తాపం నేపథ్యంలో ఆవు పేడ ద్వారా విద్యార్థులు ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందని ఆమె వివరించారు.
ఇది వివాదంగా మారి.. విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అయితే.. దీనిని కూడా ప్రిన్సిపాల్ ఖండించారు. ప్రస్తుతం వేసవి ఠారెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా.. చల్లదనంలో చదువుకునేందుకు గాను.. ఇలా క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసినట్లు ప్రిన్సిపాల్ వత్సల వివరణ ఇచ్చారు. కానీ, విద్యార్థులకు ఈ వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు. దీంతో కాలేజీకి రాకుండా డుమ్మా కొట్టారు. మరోవైపు.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం .. ఈ విషయంలో జోక్యం చేసుకుంది.
దీంతో ఇప్పుడు మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. నేరుగా ప్రిన్సిపాల్ రూమ్‌కే వెళ్లిన విద్యార్థి సంఘం నేతలు.. 25 కిలోల ఆవు పేడను ముద్దలుగా చేసి.. ఆమె గది నిండా పులిమేశారు. బయటా .. లోపల ముద్దలు ముద్దలుగా ఆవుపేడను అలిదేశారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌కు ఓ సలహా కూడా ఇచ్చారు. ``మేడం.. మీ గదికి కూడా పేడ పూశాం.. ఇక, ఏసీలు తీసేసి.. హాయిగా పనిచేసుకోండి`` అని ప్లకార్లులు అంటించారు.
విద్యార్థులకు ఎలర్జీ!
ప్రిన్సిపాల్ ప్రత్యూష చేసిన పనితో విద్యార్థులకు స్కిన్, బ్రీత్ ఎలర్జీ వచ్చినట్టు సంఘాల నాయకులు ఆరోపించారు. పేడ వాసన కారణంగా గదిలో కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు అసలు కాలేజీకి కూడా రావడం లేదని.. తెలిపారు. మరికొందరు స్కిన్ ఎలర్జీతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పేడ పూసిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.