దానం కూడా కాంగ్రెస్ బాటేనా?
ఇప్పటికే చాలా మంది నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ప్రముఖ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ ను వీడనున్నారని తెలుస్తోంది.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. పదవి ఉండగానే ఉపయోగించుకోవాలి. అధికారంలో లేకపోతే పనులు కావు. అధికారం మన చేతిలో ఉంటేనే ఏ పని అయినా చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే మన రాజకీయ నేతలు ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని వెనుక పరుగులు పెట్టడం సహజమే. పార్టీ ఏదైనా తమ పలుకుబడి ఉండాలంటే అధికారం తప్పనిసరి. దీనికి గాను వారు పార్టీలు మారుతుండటం మామూలే.
ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అధ్వానంగా మారింది. అధికారం కోల్పోయి దీన స్థితిలోకి దిగజారింది. ఈనేపథ్యంలో హైదరాబాద్ లో ఏ చిన్న పని కావాలన్నా అధికారం ఉన్న పార్టీ అండ కోసం తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా ప్రముఖ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ ను వీడనున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన దానం కాంగ్రెస్ ను పొగిడారు. రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ వచ్చాక రోజు పండగలాగే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ కు టాటాచెప్పనున్నారని సమాచారం. ఇదివరకే దానం కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. కొద్ది కాలంగా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తారనే వాదనలకు ఆయన మాటలు ఆజ్యం పోస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ లో పనులు చక్కబెట్టుకోవాలంటే అధికార పార్టీ అయితేనే కుదురుతుంది. అందుకే దానం పార్టీ మారి కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకరి వెంట మరొకరు వరుసగా క్యూ కడుతూ కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు.
ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీలో మార్పులు మాత్రం కనిపించడం లేదు. అదే అహంకార ధోరణి నేతల్లో ప్రధానంగా కనిపిస్తోంది. గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదాలో ప్రజాసమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాల్సిన బీఆర్ఎస్ నేతలు నిర్లక్ష్యంతోనే ఉంటున్నారనే వాదనలు వస్తున్నాయి. తాము చేసిన తప్పులపై సర్దిచెప్పుకుంటున్నారు కానీ ఒప్పుకోవడం లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం దిగజారిపోతోందనే వాదనలు రావడం గమనార్హం.