వెంకటేశ్, రానా, సురేష్ బాబులకు నాంపల్లి కోర్టు బిగ్ షాక్

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న దక్కన్ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత కేసు మరోసారి సంచలనం సృష్టిస్తోంది.;

Update: 2025-10-16 10:52 GMT

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న దక్కన్ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత కేసు మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఈ కీలకమైన కేసులో దగ్గుబాటి కుటుంబానికి చెందిన ప్రముఖులు సీనియర్ నటుడు వెంకటేష్‌, హీరో రానా దగ్గుబాటి, నిర్మాత సురేష్‌ బాబు, అభిరామ్‌ దగ్గుబాటికు నాంపల్లి కోర్టు బిగ్ షాక్‌ ఇచ్చింది.

కోర్టు ఆదేశాల ప్రకారం.. వీరు నవంబర్‌ 14న తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరై పర్సనల్‌ బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు విచారణకు హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

భూమి వివాదం నేపథ్యం : కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడమే కారణం

ఈ కేసు మూలం ఫిల్మ్‌నగర్‌లోని భూమి యాజమాన్యం వివాదం. నందకుమార్‌ అనే వ్యక్తి, దక్కన్ కిచెన్‌ స్థలంపై తమకు హక్కు ఉందంటూ 2022లో సిటీ సివిల్‌ కోర్టులో కేసు వేశారు. అప్పట్లో హైకోర్టు కూడా స్థల విస్తరణ, నిర్మాణాలపై తాత్కాలిక నిషేధం జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను పట్టించుకోకుండా GHMC అధికారులు బౌన్సర్ల సహాయంతో హోటల్‌ను పాక్షికంగా కూల్చివేయడం, అనంతరం 2024 జనవరిలో దగ్గుబాటి కుటుంబం పూర్తిగా కూల్చివేయడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. దీంతో నందకుమార్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఫిల్మ్‌నగర్‌ పోలీసులను ఐపీసీ సెక్షన్లు 448, 452, 458, 120బీ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

* కోర్టు ఆగ్రహం: “తప్పనిసరిగా హాజరు కావాలి”

విచారణకు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, వెంకటేష్‌–రానా హాజరుకాకపోవడంతో కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈసారి స్పష్టంగా హెచ్చరిస్తూ “పర్సనల్‌ బాండ్‌ సమర్పించేందుకు నవంబర్ 14న తప్పనిసరిగా హాజరు కావాలి” అని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

* సినీ వర్గాల్లో చర్చనీయాంశం

దగ్గుబాటి ఫ్యామిలీకి తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా, ఈ న్యాయపరమైన పరిణామం సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ వెంకటేష్‌, సురేష్‌ బాబు బలమైన స్థానం సంపాదించగా, రానా కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

టాలీవుడ్ లో దగ్గుబాటి కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. ఈ అగ్ర కుటుంబం చుట్టూ ఇప్పుడీ దక్కన్‌ కిచెన్‌ కేసు న్యాయపరమైన చిక్కులను పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News