బాబు చేతిని వదలరా...ఏమైంది కామ్రేడ్ ?
రాజకీయం అన్నది ప్రజా కోణంలో చేయాలి. ప్రజలు మెచ్చేలా ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ వైపు నిలబడి మాట్లాడితే ప్రజలు హర్షించరు.;
రాజకీయం అన్నది ప్రజా కోణంలో చేయాలి. ప్రజలు మెచ్చేలా ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీ వైపు నిలబడి మాట్లాడితే ప్రజలు హర్షించరు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ఈ వైపు చూస్తారు. ఏపీలో చూస్తే వింత రాజకీయం సాగుతోంది.
అధికార పక్షంలో మూడు పార్టీలు కూటమిగా కట్టి చేరిపోయాయి. ఇక మిగిలిన పార్టీలు కూడా కూటమి వైపు చూడకుండా వైసీపీనే టార్గెట్ చేస్తున్నాయి.. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమిని తమలపాకుతో కొట్టినట్లుగా సుతారంగా ఒకటి రెండు విమర్శలు చేస్తూ అధిక విమర్శలు వైసీపీ అధినేత మీద చేస్తూంటారు అన్నది ప్రచారంలో ఉంది.
ఇక ఏపీలో సీపీఐ తీరు కూడా అలాగే ఉందా అన్న చర్చ సాగుతోంది. వామపక్ష ఉద్యమాలలో తల పండిన నేతగా ఉన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం టీడీపీని పక్కన పెట్టి వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతోంది ఏపీలో వైసీపీ అధినేత పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి అన్న మాట ఉంది. అదే సమయంలో గతంలో టీడీపీ నేతలు కూడా అలాగే మాట్లాడారు కదా అన్నది ఉంది.
ఆ విధంగా పోలీసుల విషయంలో రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ ఆటను పెద్దాయనగా నారాయణ బయటపెట్టాల్సి ఉండగా ఆయన తన బాణాలను ఎక్కువగా వైసీపీ మీదనే ఎక్కుపెట్టడం మీద చర్చ సాగుతోంది ఇక బట్టలు ఊడదీసి ఏమి చూడాలనుకుంటున్నావ్ నీ దగ్గర ఉన్నదే వారి దగ్గరా ఉంది అని దిగజారి వ్యాఖ్యలు చేయడం పెద్దాయనకు తగునా అని అంటున్నారు.
అంతే కాదు అవుట్ రేట్ గా వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చింది. ఆ పార్టీని నిందించడం మానేసి వైసీపీది వక్ఫ్ విషయంలో రెండు నాలుకల ధోరణీ అని నారాయణ మాట్లాడడం పట్ల చర్చ సాగుతోంది. ఇక సీపీఐ ఎన్డీయేకు వ్యతిరేకమైన ఇండియా కూటమిలో జాతీయ స్థాయిలో ఉంది తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని అసెంబ్లీలో మండలిలో ప్రాతినిధ్యం సంపాదించింది
ఏపీలో చూస్తే ఆ పార్టీ రాజకీయం ఏమిటో అర్ధం కాకుండా ఉందని అంటున్నారు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన సీపీఐ ఆ విధంగా కాకుండా వ్యవహరిస్తోందా అన్న చర్చ సాగుతోంది జాతీయ పార్టీకి రాష్ట్రానికి ఒక విధానమా అని అంటున్నారు. ఇప్పటికే మూడు ఎన్నికల్లో పోటీ చేసినా అసెంబ్లీ మెట్లు ఎక్కని పార్టీని తమ అయోమయ విధానాలతో ఏమి చేద్దామని అనుకుంటున్నారు అన్న చర్చ సాగుతోంది.
ఇక చంద్రబాబు మీద సందర్భం ఉన్న ప్రతీసారీ ప్రశంసలు కురిపించడం ద్వారా ఆ పార్టీతో ఎప్పటికైనా చెలిమి ఉంటుందని ఆశిస్తున్నారా అన్నది కూడా చర్చిస్తున్నారు. చంద్రబాబుకు అభివృద్ధి కాంక్ష ఉందని,
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబుకు విజన్ ఉందని నారాయణ ఇటీవల కితాబు ఇచ్చారు అంతే కాదు అమరావతికి కేంద్ర సహకారం ఉందని రుణాలు అందుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.
అయితే బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది. 2029లో కూడా ఈ పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఇప్పటికే ప్రకటించి ఉన్నాయి. మరి టీడీపీ వైపు చూడడం ఏమిటో అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. వైసీపీతో జట్టు కట్టనక్కరలేదు, ఏపీలో న్యూట్రల్ గా ఉంటూ జనంలో బలం పెంచుకోవడం తోటి వామపక్షం అయిన సీపీఎం తో కలసి ఉద్యమాలు చేయడం ద్వారా అయినా తాము చెప్పిన బూర్జువా పార్టీల మీద రాజకీయంగా
పై చేయి సాధించేలా చూడాలి కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో సీపీఐ రాజకీయ తీరు మాత్రం విమర్శల పాలు అవుతోంది అని అంటున్నారు.