వైసీపీకి పెద్దాయన దూరం అవుతారా ?

ఇక తమ్మినేని సీతారాం అచ్చమైన తెలుగు తమ్ముడి అని చెబుతారు. ఆయనకు 1983లో ఎన్టీఆర్ టీడీపీ తరఫున టికెట్ ఇచ్చి గెలిపించారు అది లగాయితూ నాలుగు సార్లు ఆయన ఆముదాలవలస నుంచి గెలిచారు.;

Update: 2026-02-10 18:22 GMT

వైసీపీలో వర్గ పోరు చాలా నియోజకవర్గాలలో ఉంది. పార్టీ ఓటమి తరువాత అధినాయకత్వం కొన్ని చోట్ల చేసిన మార్పులతో ఆయా ప్రాంతాలలో పార్టీ రెండుగా చీలిపోయింది. దాంతో కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో చూస్తే కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గంగా ఆముదాలవలస ఉంది. ఇక్కడ నుంచి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన తమ్మినేని సీతారాం వైసీపీ పెద్దల తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో నలిగిపోతున్నారు అని అంటున్నారు. ఆయన చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాల్గొంటున్నది కూడా లేదని అంటున్నారు.

టీడీపీ ప్రోడక్ట్ గా :

ఇక తమ్మినేని సీతారాం అచ్చమైన తెలుగు తమ్ముడి అని చెబుతారు. ఆయనకు 1983లో ఎన్టీఆర్ టీడీపీ తరఫున టికెట్ ఇచ్చి గెలిపించారు అది లగాయితూ నాలుగు సార్లు ఆయన ఆముదాలవలస నుంచి గెలిచారు. మంత్రి పదవులు కూడా చేపట్టారు. జిల్లా రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరించారు. 2004లో ఓటమి తరువాత ఆయన టీడీపీ నుంచి ప్రజారాజ్యం వైపు వెళ్ళారు.. 2009లో ఆయన ఆముదాలవలస నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి టీడీపీలో చేరినా కొన్నాళ్ళు మాత్రమే ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2014, 2019, 2024లలో వైసీపీ ఆయనకు టికెట్ ఇస్తే ఆముదాలవలస నుంచి పోటీ చేశారు, 2019లో మాత్రం గెలిచారు.

మంత్రి కావాలనుకుని :

ఇక మంత్రి కావాలని తమ్మినేని తలిస్తే ఆయనకు స్పీకర్ పదవిని జగన్ ఇచ్చారు. అయిదేళ్ళ పాటు ఆ పదవిలో ఆయన ఉన్నారు. 2024 లో ఓటమి తరువాత వైసీపీ అధినాయకత్వం ఆముదాలవలస నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా కొత్త వారు యువకుడు అయిన చింతాడ రవికుమార్ ని నియమించింది. తమ్మినేనిని శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జిగా నియమించింది. అయితే తమ్మినేని నాలుగున్నర దశాబ్దాల బంధం ఉన్న ఆముదాలవలస తమ కుటుంబానికి కాదని బయట వ్యక్తికి ఇవ్వడం పట్ల అసంతృప్తికి లోను అవుతున్నారని అంటున్నారు. దీంతో వైసీపీ ఇంచార్జి రవి కుమార్ కి ఆయన సహకరించడం లేదని అంటున్నారు. పైగా రెండు వర్గాలు ఆముదాలవలసలో తయారు అయ్యాయి.

కొత్త ఫేస్ తోనే :

ఇక అధినాయకత్వం తీరు చూస్తే ఈసారి కొత్త ఫేస్ ని ముందు పెట్టి ఆముదాలవలసలో గెలవాలని చూస్తోంది. తమ్మినేనికి పార్లమెంట్ సీటు కేటాయిస్తారు అని అంటున్నారు. అయితే తాను ఎంపీగా తన కుమారుడికి ఆముదాలవలస సీటు ఇవ్వాలని ఆయన కోరుతున్నారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఎంపీ సీటు ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ ఆముదాలవలసను ఎట్టిపరిస్థితిలలో వదులుకోమని తేల్చి చెబుతున్నారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ్మినేని ఏకంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు.

షాక్ ఇస్తారా :

వైసీపీ నుంచి బయటకు రావాలని తమ్మినేని సీతారాం అనుకుంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కాళింగులు అంతా కలసి ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకుని జిల్లాలో పోటీ చేస్తారు అని అంటున్నారు. అలా తమ్మినేని కూడా ఏదైనా కొత్త ఆలోచనలలో ఉన్నారా అన్నది కూడా చర్చగా ఉంది. తమ్మినేని విషయంలో వైసీపీ పెద్దలు ఏ విధంగా ఆలోచనలు చేస్తున్నారో తెలియదు కానీ తొందరలోనే ఈ పెద్దాయన పార్టీకి భారీ షాక్ ఇస్తారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News