లడ్డూ ఇష్యూలోకి స్వామీజీలు.. చంద్రబాబు వ్యూహం ఏంటి?

తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయ పోరాటం పతాకస్థాయిలో సాగుతోంది. ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గకూడదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటున్నారు.;

Update: 2026-02-10 15:30 GMT

తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయ పోరాటం పతాకస్థాయిలో సాగుతోంది. ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గకూడదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో విపక్ష వైసీపీ కూడా ఎదురుదాడిని ముమ్మరం చేసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం రగులుతున్న రావణకాష్టాన్ని తలపిస్తోంది. ఈ విషయంలో సీబీఐ సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయాన్ని మరో మలుపు తిప్పాయని అంటున్నారు. ప్రభుత్వం ఆరోపించినట్లు లడ్డూ కల్తీపై వైసీపీకి చెందిన టీటీడీ మాజీ చైర్మన్ల పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని, దీంతో ప్రభుత్వం ఒకింత ఆత్మరక్షణకు గురైందని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా పావులు కదిపి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. లడ్డూ కల్తీపై 2024లో వివాదం ప్రారంభమైతే ఇప్పటివరకు కల్పించుకోని హిందు మత సంస్థలు, స్వామీజీలు, సాధు సంతులను సడన్ గా తెరపైకి తెచ్చారని అంటున్నారు. లడ్డూ ప్రసాదం తయారీకి రసాయనాలు వాడారని రెండు వారాల క్రితమే సీబీఐ సిట్ నివేదిక ఇవ్వగా, ఆ నివేదిక ఆధారంగా తాజాగా సాధువులు ఆందోళనలకు దిగడం చర్చకు దారితీస్తోంది.

సాధువులతోపాటు తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, తిరుమల పెద్ద జీయర్ వంటివారు ఈ విషయంలో స్పందిస్తున్న తీరు చూస్తే, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉంటుందని అంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో రసాయనాలను వాడటాన్ని లవ్ జిహాద్ తరహాలో ‘లడ్డూ జిహాద్’గా అభివర్ణిస్తూ ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అదేవిధంగా వందలాది మంది సాధు సంతులు తిరుపతి సమీపంలోని అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగడం చర్చకు దారితీస్తోంది.

ఇదే సమయంలో కల్తీ జరిగిందని తెలిసి అదే నెయ్యిని పవిత్ర ప్రసాదంలో కొనసాగించడం అపచారమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్యగా తిరుమల పెద్ద జీయర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరం జరగకుండా సీఎం చంద్రబాబు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఇలా సాధువులు, స్వామీజీలు, జీయర్లు ఒకేసారి గళం విప్పడం గమనిస్తే ‘లడ్డూ విషయం’లో విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలనే పథకమే కనిపిస్తోందని అంటున్నారు.

నిజానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన తీవ్ర సంచలనానికి దారితీసింది. దేశవ్యాప్తంగా హిందూ భక్తులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని చెబుతున్నారు. ఈ ఊహించని పరిణామంతో గత ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఉక్కపోత అనుభవించారు. సీఎం చేసిన ప్రకటన నుంచి తప్పించుకోవడంతోపాటు తమ తప్పు లేదని చెప్పుకోడానికి తీవ్రంగా శ్రమించాల్సివచ్చిందని అంటున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో జంతు కొవ్వుపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో వైసీపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.

అదే సమయంలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు. ఇక సిట్ నివేదికతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కనిపించాయని అంటున్నారు. ముందుగా సీఎం చంద్రబాబు ఆరోపించినట్లు జంతు కొవ్వుపై సిట్ చార్జిషీటులో స్పష్టమైన సమాచారం లేకపోయినా, చుక్క పాలు లేకుండా రసాయానాలను వాడి నెయ్యిని తయారు చేసిందన్న అభియోగాలు ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించాయని అంటున్నారు. అయితే కల్తీ సహజమే అంటూ వైసీపీ నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు వివాదాన్ని తేలిక చేశాయన్న అభిప్రాయం వ్యక్తమైందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జంతు కొవ్వు అంశాన్ని వెనక్కి నెట్టి.. రసాయనాలతో నెయ్యిని తయారు చేశారన్న అంశాన్ని హైలెట్ చేయాలని ప్రభుత్వ అనుకూల వర్గాలు నిర్ణయానికి వచ్చాయని అంటున్నారు.

ఈ క్రమంలోనే హిందూ సంఘాలు, స్వాములు, జీయర్లు తెరపైకి వచ్చి రసాయన నెయ్యిపై ఆందోళన చేస్తున్నారని అంటున్నారు. ఇంతకు ముందు ఇదే విషయంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటివారితో ప్రభుత్వ అనుకూల మీడియాతో మాట్లాడించారు. ఇప్పుడు సాధువులు కూడా రోడ్డెక్కడంతో ప్రతిపక్షం వైసీపీ టార్గెట్ గా ప్రభుత్వం వర్గాలు పక్కా ప్రణాళికతో పావులు కదుపుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రసాయన నెయ్యి విషయమై వైసీపీ ఎలా ముందుకు వెళుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News