అంబటితో ములాఖత్ -ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

లడ్డూ వివాదంలో ఏమైనా తప్పు జరిగితే నిందితుల మీద చర్యలు తీసుకోవాలని అది ప్రభుత్వం ధర్మం అని ఆయన అన్నారు.;

Update: 2026-02-10 16:54 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయనను తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి కేసు ఆయనకు సెంట్రల్ జైలు తరలింపు వంటివి ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలుగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో చేసిన ప్రయత్నం అని క్లియర్ గా అర్థం అవుతోంది అని ఆయన విమర్శించారు. అంబటి ఇంటి మీద దాడి చేసి అయిదారు గంటల పాటు భయోత్పాతానికి గురి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు అని అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని పట్టుకుని రోజుల తరబడి జైలులో వేశారు అని ఇది టూమచ్ అని ఉండవల్లి పేర్కొన్నారు.

ఎటు దారి తీస్తుందో చూడాలని :

ఈ విధంగా ఏపీలో కక్షపూరితమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో ఇది ఎటు దారి తీస్తుందో చూడాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చూస్తే అంబటికి వైసీపీకి లాభం కలిగే లాగానే ఈ పరిణామాలు తీసుకుని వచ్చారని ఆయన అన్నారు. కొట్టిన వారికి స్టేషన్ బెయిల్ తిట్టిన వారికి సెంట్రల్ జైలు అన్నట్లుగా కొత్త ఒరవడికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు.

లడ్డూ వివాదం ఆపాలి :

లడ్డూ వివాదంలో ఏమైనా తప్పు జరిగితే నిందితుల మీద చర్యలు తీసుకోవాలని అది ప్రభుత్వం ధర్మం అని ఆయన అన్నారు. అంతే తప్ప పదే పదే లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు మాసం కలిసిందని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం సరికాదని అన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని ఉండవల్లి హితవు చెప్పారు. తిరుపతి లడ్డూ మీద ఏహ్య భావం కలిగించాలని చేస్తున్న ప్రయత్నమా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దైవ ద్రోహం చేయవద్దు :

హైందవ ధర్మాన్ని నాశనం చేసే శక్తి ఎవరికీ లేదని ఉండవల్లి అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలతో దైవ ద్రోహానికి పాల్పడడమే అవుతుందని అన్నారు. చంద్రబాబుని సీఎం గా తాను చాలా కాలంగా చూస్తున్నాను అని ఆయన ఎపుడూ బ్యాలెన్స్ తప్పి మాట్లాడింది లేదని అన్నారు. కానీ ఎందుకో ఈ ఇష్యూలో మాత్రం ఆయన మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందని ఉండవల్లి అన్నారు.

కేసులు పెట్టండి :

అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు ఎవరు చేసినా కేసులు పెట్టండి అని ఉండవల్లి డిమాండ్ చేశారు. అంతే తప్ప మధ్యలోకి ఇలాంటి విషయాలు తేవడం కూడదని అన్నారు వైసీపీ మీద రాజకీయంగా తేల్చుకోవాలనుకుంటే తేల్చుకోండని ఆయన బాబుకు సూచించారు. కూటమి చేతిలో అధికారం ఉందని ఆయన గుర్తు చేశారు. జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లు అందరూ వెంకటేశ్వరస్వామికి వ్యతిరేకం అని చెప్పదలిచారా అని ప్రశ్నించారు. తమది హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ తరహా వ్యాఖ్యలు ఎపుడూ చేయలేదని ఆయన గుర్తు చేశారు. రాజకీయాలు వేరు ఇతర సున్నితమైన అంశాలు వేరు అని ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News