ఫోన్ ట్యాపింగ్ కలకలం: కేసీఆర్ మామిడి తోట నుంచే ఆపరేషన్?

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 80 శాతానికి పైగా మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.;

Update: 2026-02-10 18:22 GMT

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ అక్రమ తంతు ఇప్పటికీ కొనసాగుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన ఫోన్ ఇప్పటికీ ట్యాపింగ్‌కు గురవుతోందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై విమర్శల వర్షం కురిపించారు.

అంతర్గత విషయాలు ఎలా లీక్ అవుతున్నాయి?

ప్రభుత్వంలో ఉన్న తమ మధ్య జరుగుతున్న అత్యంత వ్యక్తిగత అంతర్గత సమాచారం బయటికి ఎలా వెళ్తుందో అర్థం కావడం లేదని పొంగులేటి ఆందోళన వ్యక్తం చేశారు. "మేము చేసుకుంటున్న కాన్ఫరెన్స్ కాల్స్ విషయాలు కూడా ఇతరులకు తెలిసిపోతున్నాయి. ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వల్లే జరుగుతోంది. ట్యాపింగ్‌కు సంబంధించిన పరికరాలు ఇంకా బీఆర్ఎస్ నేతల వద్దే ఉన్నాయనే బలమైన సందేహం మాకు ఉంది " అని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.

కేసీఆర్ మామిడి తోటపై గురి..

మాజీ సీఎం కేసీఆర్ తన మామిడి తోటలో కూర్చుని ఫోన్ ట్యాపింగ్ చేయిస్తూ తమ మాటలను వింటున్నారనే అనుమానం ఉందని పొంగులేటి వ్యాఖ్యానించారు. "అక్రమంగా కాల్స్ వినేందుకు వాడే పరికరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మామిడి తోటల్లో ఉన్నాయా ఫామ్ హౌస్‌లలో ఉన్నాయా లేక ప్రైవేట్ ఇళ్లలో దాచారా? అనే అంశంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాం. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు," అని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికలపై ధీమా.. 80 శాతం మావే!

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 80 శాతానికి పైగా మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. బీఆర్ఎస్ నేతలు ఓటమి భయంతోనే పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తున్నారు. గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కేటీఆర్ చేసిన ఛాలెంజ్‌లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.

జిల్లాల పునర్విభజనపై క్లారిటీ

కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందిస్తూ.. ప్రస్తుతం జిల్లాల పెంపు లేదా తగ్గింపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన జిల్లాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక కమిటీని వేస్తామన్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని, కనీసం ఆ చర్చకైనా కేసీఆర్ సభకు రావాలని పొంగులేటి సూచించారు.

నేను సీఎం రేసులో లేను

తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని పొంగులేటి ఖండించారు. "నేను పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను మాత్రమే. పదవుల కోసం ఆశపడే వ్యక్తిని కాదు. ఈ విషయంలో ఎవరి అభిమానం వారిది కావచ్చు కానీ, నేను సీఎం రేసులో లేనని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను " అని వివరణ ఇచ్చారు.

రెండేళ్ల పాలన.. పేదల సంక్షేమం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఆర్థిక వ్యవస్థను చెల్లాచెదురు చేసిందని మండిపడ్డారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా రైతులకు రుణమాఫీ, రైతు భరోసా అందిస్తూ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు 71 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News