కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు...బీజేపీ ఎంపీలు ఓడారు..

ముందుగా చూస్తే బీజేపీ తరఫున కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్ అసెంబ్లీకి పోటీ చేసి బీయారెస్ మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓడారు.;

Update: 2023-12-03 13:45 GMT

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ బీజేపీ తమ ఎంపీ అభ్యర్ధులను పోటీలోకి దించాయి. ఇక బీయారెస్ కూడా మెదక్ ఎంపీగా ఉన్న ప్రభాకరరెడ్డిని దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించింది. ఇందులో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది.

ముందుగా చూస్తే బీజేపీ తరఫున కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్ అసెంబ్లీకి పోటీ చేసి బీయారెస్ మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓడారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్లలో పోటీ చేసి బీయారెస్ అభ్యర్ధి కల్వకుంట్ల సంజయ్ మీద ఓడిపోయారు. అలాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోధ్ నుంచి పోటీ చేసి బీయారెస్ అభ్యర్ధి అనిల్ జాదవ్ చేతిలో ఓడిపోయారు.

అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఎంపీలు పోటీకి దిగారు. వారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అలాగే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా ఉంటూ కొడంగల్ లో పోటీ చేసి గెలిచారు. ఇక మరో ఎంపీ ఉత్తం కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు.

అదే విధంగా దుబ్బాక నుంచి మంచి మెజారిటీతో మెదక్ బీయారెస్ ఎంపీ ప్రభాకరరెడ్డి గెలిచారు. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ వేవ్ లో ఎంపీలు గెలిచారు అని భావించినా బీయారెస్ ఎంపీ కూడా గెలిచారు. మరి అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పుకున్న బీజేపీ ఎంపీలు ముగ్గురూ ఓటమి చెందడం విశేషమే.

అంతే కాదు బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన బండి సంజయ్ మూడేళ్ల పాటు తెలంగాణాలో బీయారెస్ మీద ఎన్నో పోరాటాలు చేశారు. వాటి ఫలితాలు ఆయనతో పాటు బీజేపీ అభ్యర్ధులకు అందలేదా అన్నది ప్రశ్నగా ఉంది. అయితే బీజేపీకి గత అసెంబ్లీలో ఉన్న మూడు సీట్లు కాస్తా ఎనిమిదిగా అయ్యాయంటే అది కూడా గొప్పతనమే అని అనుకోవాలి.

Tags:    

Similar News