కాంగ్రెస్ కి షాక్...వారంతా వాలంటరీ రిటైర్మెంట్
రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణా కోటాలో 2020లో నెగ్గిన కేవీపీ రామచంద్రరావు పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో పూర్తి అవుతోంది. దాంతో ఆయన ఇక రాజకీయాలకు స్వస్తి వాచకం పలుకుతారు అని టాక్ నడుస్తోంది.;
రాజకీయాల్లో కాలం కలసి రాకపోతే ఎంతటి వారు అయినా ఇంట్లో కూర్చోవాల్సిందే. ఇది చరిత్ర చెప్పే సత్యం. అలాగే ఇంట్లో కూర్చున్న వారు అయినా లక్ ని తొక్కి వస్తే ఏకంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా అవుతారు. ఇక ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి అన్నది నానాటికి లేకుండా పోతోంది. ఆ పార్టీ అంటే ఒకనాడు ఠక్కున ఒక్కో జిల్లాలో అరడజన్ కి పైగా సీనియర్ నేతల పేర్లు నోట పలికేవి. ఇపుడు మాత్రం ఎవరూ లేరు, ఉన్న వారు బయటకు రారు అన్నట్లుగా సీన్ ఉంది.
వీరంతా ఏరి అంటే :
ఏపీలో విభజన తరువాత కాంగ్రెస్ ఒక్కసారిగా బలహీనపడింది. వీలుని చూసి మిగిలిన పార్టీలలో నాయకులు అంతా చేరిపోయారు. అలా టీడీపీలో వైసీపీలో నేతలు అంతా సర్దుకున్నారు. దాని కంటే ముందే వైసీపీ ఏర్పాటుతో అనేక మంది పార్టీ గీత దాటారు. ఇక 2014 తరువాత నుంచి 2019 మధ్యలో అలాగే 2019 నుంచి 2024 మధ్యలో కూడా చాలా మంది పార్టీని వీడారు. ఇక చూస్తే నిఖార్సు అయిన నేతలు అలాగే నిబద్ధత కలిగిన నేతలతో పాటు ఏ పార్టీలోనూ ఇమడ లేని వారు పిలుపు రాని వారు అంతా కూడా కాంగ్రెస్ లో ఉంటున్నారు వీరంతా ఇపుడు చురుకుగా అయితే లేరు.
కేవీపీ పదవి పూర్తి :
రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణా కోటాలో 2020లో నెగ్గిన కేవీపీ రామచంద్రరావు పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో పూర్తి అవుతోంది. దాంతో ఆయన ఇక రాజకీయాలకు స్వస్తి వాచకం పలుకుతారు అని టాక్ నడుస్తోంది. ఏడున్నర పదుల వయసు కలిగిన కేవీపీ రాజకీయంగా పెద్దగా చురుకుగా అయితే లేరు. ఏపీలో కాంగ్రెస్ ని నడిపించాలని ఆయన పీసీసీ చీఫ్ గా షర్మిల నియమితులైన కొత్తల్లో సలహాలు ఇచ్చేవారు అని చెబుతారు. ఆ తరువాత అది కూడా లేకుండా పోయింది అని అంటున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తనదైన పంధాలో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తులసిరెడ్డి సైతం అలాగే ఉన్నారు. జేడీ శీలం లాంటి కేంద్ర మాజీ మంత్రులు సైతం అపుడపుడు కనిపిస్తున్నారు అని అంటున్నారు.
గోదావరి జిల్లాలో :
ఇక గోదావరి జిల్లాలో చూస్తే కనుక రక్షణ శాఖ వంటి కీలకమైన శాఖను చూసిన పల్లం రాజు పూర్తిగా సైలెంట్ అయ్యారని అంటున్నారు. అలాగే మీసాల రాజుగా పేరు పొందిన కనుమూరి బాపిరాజు సైతం వృద్ధాప్యం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అని చెబుతున్నారు. గోదావరి జిల్లాలో మాజీ ఎంపీ హర్ష కుమార్ లాంటి వారు ఉన్నా కాంగ్రెస్ కి దూరం పాటిస్తున్నారు ఎనిమిది పదుల వయసులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బరామిరెడ్డి విశాఖలో ఒకనాడు కాంగ్రెస్ జెండా ఎగరేశారు. అయితే ఆయన కూడా హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాలకు దూరం పాటిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో తిరిగి చేరినా యాక్టివ్ గా అయితే లేరు వీరితో పాటు అనేక మంది ఇతర నేతలు అయితే గమ్మున ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలన్నది ఎవరు అనుకున్న సాధ్యపడేది కాదన్న తత్వంతో కొంతమంది ఉంటే ఎందుకొచ్చిన రాజకీయాలు అన్న వైరాగ్యంలో మరి కొందరు ఉన్నారు.. ఇదీ ఏపీ కాంగ్రెస్ లో కధ.