జాతీయ రాజకీయాల్లోకి పవన్ ?

మరో వైపు చూస్తే ఏపీలో కూటమి పదిహేనేళ్ల పాటు సాగాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు.;

Update: 2026-02-18 03:46 GMT

ఏపీలో కీలక నేతలు అంతా గతంలో జాతీయ రాజకీయాల మీద మోజు పడిన వారే. వెండి తెర వేలుపుగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి సూపర్ హిట్ చేశాక జాతీయ రాజకీయాల మీద ఆసక్తిని పెంచుకున్నారు. అలా నేషనల్ ఫ్రంట్ ప్రయోగానికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే ఎన్ టీఆర్ ప్రధాని కావాలన్న కోరిక మాత్రం తీరకుండానే రాజకీయం ముగిసింది. కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాలు అంటూ టీఆర్ఎస్ ని కాస్తా బీఆర్ఎస్ గా మార్చారు. తీరా చూస్తే 2023లో తెలంగాణాలోనే పార్టీ ఓటమి చెందడం జరిగింది.

ఏపీ నేతల తీరు :

చంద్రబాబు అయితే జాతీయ రాజకీయాల్లో తన పాత్రను జాగ్రత్తగా చూసుకుంటారు కానీ ఆ వైపుగా అసలు చూడారు, ఆయన ఏపీనే ఫస్ట్ అంటారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సైతం ఆదే విషయం స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ అయితే పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణా వైపు కూడా తొంగి చూడరు. మరి కొత్తగా జనసేన పార్టీని పెట్టిన పవన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

పార్టీ విస్తరణతో :

ఏపీలో ఉన్న జనసేనను తెలంగాణాలోనూ విస్తరించే క్రమంలోనే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఫలితాల సంగతి పక్కన పెడితే జనసేన తన తొలి అడుగులు వేసింది అని చెప్పాలి. ఇక జనసేన అధినేత పవన్ కి తెలంగాణా ఏపీతో పాటు తమిళనాడు కేరళ, కర్ణాటకలో సైతం అభిమాన గణం ఉన్నారు. ఒక విధంగా ఆయన జాతీయ స్థాయిలో చూపు చూస్తే మాత్రం ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశాలు అయితే స్పష్టంగానే ఉన్నాయని అంటున్నారు.

ఈ ప్రచారం సైతం :

మరో వైపు చూస్తే ఏపీలో కూటమి పదిహేనేళ్ల పాటు సాగాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలోనూ ఆయన ఇదే విషయం చెప్పారు. అయితే 2029 లో మరోసారి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పవన్ పాత్ర ఎలా ఉండబోతోంది అన్న చర్చ కూడా సాగుతోంది. చంద్రబాబు ఆనాటికి తన కుమారుడు నారా లోకేష్ ని సీఎం గా చేస్తారు అన్న ప్రచారం కూడా ఉంది మరి లోకేష్ సీఎం అయితే పవన్ సంగతి ఏమిటి అన్నది కూడా మరో చర్చగా ఉంది. అయితే పవన్ జాతీయ స్థాయిలో తన స్థానం మార్చుకుంటారు అని అంటున్నారు. ఆ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

కేంద్ర మంత్రి గానా :

పవన్ వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని ఆ విధంగా ఆయన జాతీయ రాజకీయాల్లో చేరి నరేంద్ర మోడీ కేబినెట్ లో కీలక మంత్రిత్వ శాఖలను చేపడతారు అని ఆ విధంగా కూటమి పొత్తు బలిష్టంగా కొనసాగుతుందని ఏ విధమైన పొరపొచ్చాలు లేకుండా ఉంటుందని చెబుతున్న వారూ ఉన్నారు. అయితే పవన్ సీఎం అవుతారు అనే జనసేన వారు అంతా ఓటేశారు. అంతే కాదు ఏనాటికి అయినా తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటారని, తాము చూస్తామని వారు భావిస్తున్నారు అయితే పవన్ లోక్ సభకు పోటీ చేస్తారు అంటే అది జనసేన శ్రేణులకు తప్పుడు సంకేతం ఇస్తుందని అందువల్ల కూటమి విజయావకాశాల మీద ప్రభావం చూపిస్తుందని అంటున్న వారూ ఉన్నారు.

చర్చ అయితే ఇప్పటి నుంచే :

అయితే 2029 లో పిఠాపురం తో పాటు కాకినాడ ఎంపీ సీటుకు పోటీ చేసి ఆ తరువాత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒక దాన్ని వదులుకోవడమో లేదా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా రాజ్యసభకు వెళ్ళడం ద్వారా అయినా ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు అని చర్చ అయితే ఇప్పటి నుంచే చేస్తున్న వారూ ఉన్నారు. మొత్తానికి చూస్తే కూటమి రాజకీయాలు పదవుల కూర్పు అధికారాల మార్పు వీటి నేపథ్యంలో పవన్ చూపు జాతీయ స్థాయిలో ఉంది అన్నది ఒక ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత వరకూ నిజమో కాలమే చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News