ఎక్కువ మాట్లాడితే.. ఆడోళ్లతో కొట్టిస్తా: కొండా సురేఖ మాస్ వార్నింగ్
ఎవరైనా సరే ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ మాజీ మంత్రి, వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్ష నాయకులకు ఒకేసారి కలిపి వార్నింగ్ ఇచ్చారు. తన గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ.. ఎక్కువగా మాట్లాడితే.. ఆడోళ్లతో ఉరికించి ఉరికించి చిత్తుగా కొట్టిస్తా.. అంటూ మాస్ వార్నింగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం.. ఆమె వరంగల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
"నాగురించి కానీ, నా ఫ్యామిలీ గురించి కానీ.. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మహిళలతో కొట్టిస్తా. ఉరికించి ఉరికించి వరంగల్ రోడ్లపై చిత్తుగా తన్నిస్తా"అని సురేఖ వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హద్దులు దాటితే మహిళలతోనే తగిన బుద్ధి చెప్పిస్తా.. అని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కాంగ్రెస్‌లోనే ఉంటామని.. పార్టీ మారే ఉద్దేశం తనకులేదన్నారు. తానంటే గిట్టని వారే.. తనపై చెడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఇక, తనకు మంత్రి పదవి పోవడంపై ఎలాంటి బాధ లేదని అన్నారు. పదవుల కోసం కొండా కుటుంబం ఎప్పుడు పాకులాడలేదన్నారు. గతంలో మంత్రి పదవికి తానే రాజీనామా చేసి న విషయాన్ని గుర్తు చేశారు. అయితే.. మంత్రి గా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సేవ చేసే అవకాశం ఉండేదని, ఇప్పుడు కేవలం వరంగల్ నియోజకవర్గ అభివృద్ధిపైనే పూర్తి దృష్టి సారిస్తానని కొండా వ్యాఖ్యానించారు. అయినా.. తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పార్టీ పరంగా అందరితోనూ సఖ్యతగానే ఉన్నట్టు చెప్పారు.
తమ అనుచరులపై, కార్యకర్తలపై ఈగ వాలినా ఊరుకునే ప్రసక్తి లేదని సురేఖ తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలపై మాట్లాడుతూ.. వరంగల్‌లో బీఆర్ఎస్, బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి మాట్లాడాలని బీజేపీ నాయకులకు ఆమె సవాల్ విసిరారు. వరంగల్ లో జెండా ఎగురవేస్తామని చెబుతున్న నాయకులు ముందు.. జిల్లా కోసం కేంద్రం నుంచి ఏం తీసుకువచ్చారో చెప్పాలని సవాల్ రువ్వారు.