స్పీక‌ర్‌గారూ తేల్చేయండి: హైకోర్టు ఆదేశం

ఈ విష‌యంలో త‌గు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. త‌గు చ‌ట్ట‌ప‌ర‌మైన సంతృప్తి త‌మ‌కు ల‌భించ‌లేద‌ని భావిస్తే.. తిరిగి కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని.. మ‌హిళా ఎమ్మెల్యేల‌కు హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

Update: 2026-09-29 11:39 GMT

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా రెండు వారాల కింద‌ట జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ చేయాల‌ని.. బాధిత ఎమ్మెల్యేల వాద‌న వినిపించుకుని త‌గు న్యాయం చేయాల‌ని స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ ను హైకోర్టు కోరింది. ఈ విష‌యంలో త‌గు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. త‌గు చ‌ట్ట‌ప‌ర‌మైన సంతృప్తి త‌మ‌కు ల‌భించ‌లేద‌ని భావిస్తే.. తిరిగి కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని.. మ‌హిళా ఎమ్మెల్యేల‌కు హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ లోగా విష‌యాన్ని స్పీక‌ర్ ప‌రిశీలించి.. ప‌రిష్క‌రించాల‌ని పేర్కొంది.

ఏం జ‌రిగింది?

వ‌ర్షాకాల స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ న‌లుపురంగు టీ ష‌ర్టులు ధ‌రించి.. నిర‌స‌న‌గా అసెంబ్లీకి వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో అసెంబ్లీ గేటు వ‌ద్ద‌.. వివాదం రేగింది. ఈ క్ర‌మంలో మ‌హిళా ఎమ్మెల్యేలు.. సునీలా ల‌క్ష్మారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి వంటివారితో పోలీసులు ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగార‌ని బీఆర్ ఎస్ ఆరోపించింది. ఇక‌, త‌న దుస్తులు కూడా చించేశార‌ని ల‌క్ష్మారెడ్డి ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. తాజాగా వీరి పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఎమ్మెల్యేల‌పై దూకుడా!

పోలీసులు హ‌ద్దులు మీరుతున్నార‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. మ‌హిళా ఎమ్మెల్యేల‌పైనే దాడులు చేస్తారా? అని నిల‌దీసింది. వీరిని త‌క్ష‌ణ‌మే గుర్తించాల‌ని.. దాడుల‌కు తెగ‌బ‌డిన పురుష, మ‌హిళా పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకో వాల‌ని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. స‌ద‌రు నివేదిక‌ను స్పీక‌ర్ ప్ర‌సాద‌కుమార్‌కు అందించాల‌ని ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా పోలీసుల త‌ర‌ఫున న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ.. మ‌హిళా ఎమ్మెల్యేలే పోలీసుల‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని తెలిపారు. అయితే.. హైకోర్టు ఈ వాద‌న‌ను తోసిపుచ్చింది. ఇంకా అలాంటి ప‌రిస్థితి రాలేద‌ని పేర్కొంది. ఆధారాలు కూడా క‌నిపించ‌డం లేద‌ని తెలిపింది.

లోప‌లా? బ‌య‌టా?

ఇక‌, అసెంబ్లీ వివాదంపై హైకోర్టు మ‌రో కీల‌క వ్యాఖ్య చేసింది. అసెంబ్లీ గేటు నుంచి బ‌య‌ట ఏం జ‌రిగినా.. దానిపై తాము విచార‌ణ చేస్తామ‌ని పేర్కొంది. అదేస‌మ‌యంలో గేటు లోప‌ల ఏం జ‌రిగినా.. స్పీక‌ర్ బాధ్యుడు కాబ‌ట్టి.. ఆయ‌న విచారిస్తార‌ని తెలిపింది. ఒక‌వేళ స్పీక‌ర్ సంతృప్తిక‌ర నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపించ‌క‌పోయినా.. న్యాయం జ‌ర‌గ‌క‌పోయినా.. హైకోర్టును ఆశ్ర‌యించాల‌ని పిటిష‌నర్ల‌ను సూచించింది.

Tags:    

Similar News