జనసేన నుంచి సినీ హీరో?.. ఖైరతాబాద్ బరిలో పవన్ పార్టీ!
వచ్చే ఆరునెలల్లోగా ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించాల్సివుందని అంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో మరోసారి ఉప ఎన్నిక వేడి రాజుకుందని చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపాలని భావిస్తున్న జనసేన పార్టీ త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీకి ఉవ్విళ్లూరుతోందని అంటున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన సినీ హీరోను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కోర్టు అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. వచ్చే ఆరునెలల్లోగా ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించాల్సివుందని అంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో మరోసారి ఉప ఎన్నిక వేడి రాజుకుందని చెబుతున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటివరకు రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరగనుండటంతో రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. తాజాగా ఖైరతాబాద్ లోనూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన కారణంగా దానంపై అనర్హత వేటు వేశారు. ఇక గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ త్వరలో జరిగే ఖైరతాబాద్ ఎన్నికపైనా గట్టి ఫోకస్ చేసిందని అంటున్నారు.
తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగి దాదాపు మూడేళ్లు కావస్తుండటంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. ఈ నియోజకవర్గ ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో అధికార కాంగ్రెస్, విపక్షం బీఆర్ఎస్ సర్వశక్తులు వడ్డి పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు తహతహలాడుతోంది. మరోవైపు కొత్తగా పార్టీ పెట్టిన మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా అదృష్టం పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
ఇలా తెలంగాణలో యాక్టివ్ గా పనిచేస్తున్న నాలుగు పార్టీలు ఖైరతాబాద్ ను సవాల్ గా తీసుకోవాలని భావిస్తుండగా, జనసేన తెలంగాణ నేతలు కూడా మేము సైతం అంటూ బరిలో దిగాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ప్రధానంగా నగరంలో అధినేత పవన్ కల్యాణ్ అభిమానులను సంఘటితం చేసేందుకు ఈ ఉప ఎన్నికను వాడుకోవాలని జనసేన నేతలు భావిస్తున్నారని అంటున్నారు. కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న జనసేన నేతలు ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలు నియోజకవర్గంలో ఉండటం వల్ల జనసేనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా జనసేన ఓటు బ్యాంకు పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో నిర్ణయాత్మకశక్తిగా ఎదగాలంటే తప్పనిసరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దించాలనే విషయమై చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. ఖైరతాబాద్ అభ్యర్థిగా ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిని నిలపాలనే ఆలోచనతో సినీ రంగానికి చెందిన ప్రముఖుడిని పోటీకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ అధినేత పవన్ కు అత్యంత సన్నిహితుడైన ఆ హీరోకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని అంటున్నారు. దీంతో జనసేన తరఫున పోటీ చేయబోయే ఆ సినీ హీరో ఎవరబ్బా..? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ కు తెరతీసింది.