కేసీఆర్ కార్యాల‌యంలో ''జై రేవంత్‌'' నినాదాలు!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌.. క్యాంపు కార్యాల‌యంలో కాంగ్రెస్ నాయ‌కులు హ‌ల్చ‌ల్ చేశారు.;

Update: 2026-04-04 18:12 GMT

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌.. క్యాంపు కార్యాల‌యంలో కాంగ్రెస్ నాయ‌కులు హ‌ల్చ‌ల్ చేశారు. ఆయ‌న కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌భుత్వానికి, ముఖ్య‌మంత్రికి కూడా అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ ఘ‌ట‌న స్థానికంగానే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. కాంగ్రెస్‌పార్టీ నాయ‌కుల‌పై బీఆర్ ఎస్ నేత‌లు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భ‌ధ్ర‌త‌లు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు.

ఏం జ‌రిగింది?

వ‌రుస విజ‌యాల‌కు కేరాఫ్ అయిన‌కేసీఆర్‌.. గ‌త 2023 ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుంచి మ‌రోసారి విజ‌యం సాధించారు. పార్టీ ప‌రంగా అధికారం కోల్పోయినా.. ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ ఆది నుంచి కూడా కేసీఆర్‌కు క్యాంపు కార్యాల‌యం ఉంది. దీనికి సంబంధించిన వ్య‌వ‌హారాలు.. ఖ‌ర్చులు.. సిబ్బందివేత‌నాలు అన్నీ స‌ర్కారు ఇస్తుంది.(ఎమ్మెల్యే నిధుల నుంచే). ఇప్ప‌టి వ‌ర‌కు.. ఈ వ్య‌వ‌హారం సానుకూలంగానే గ‌డిచిపోయింది. కానీ, అనూహ్యంగా శ‌నివారం కాంగ్రెస్ పార్టికి చెందిన జిల్లాస్థాయి అధ్య‌క్షురాలు.. ఆమె అనుచ‌రులు ఈ కార్యాల‌యంలోకి ప్ర‌వేశించారు.

ఈ సమ‌యంలో సిబ్బంది వారించినా.. వారు దూకుడుగా వ్య‌వ‌హ‌రించిదౌర్జ‌న్యం చేశార‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు ఆరోపిస్తున్నా రు. క్యాంపు కార్యాల‌యంలోకి వెళ్లిన కాంగ్రెస్‌నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు.. కేసీఆర్ ఫొటోల‌ను ఎత్తుకు పోయార‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. కానీ, బీఆర్ ఎస్ నాయ‌కులు మాత్రం ధ్వంసం చేశార‌ని చెబుతున్నారు. ఫ‌ర్నిచ‌ర్‌ను కూడా నాశ‌నం చేశార‌ని ఆరోపిస్తున్నారు. అనంత‌రం.. అక్క‌డే సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. దాదాపు అర‌గంట పాటు కాంగ్రెస్ నాయ‌కులు హ‌ల్చ‌ల్ చేసిన‌ట్టు చెబుతున్నారు.

మండిప‌డ్డ బీఆర్ ఎస్‌..

ఈ ఘ‌ట‌న వ్య‌వ‌హారం దావాన‌లంలా వ్యాపించింది. దీనిని మాజీ మంత్రి హ‌రీష్‌రావు స‌హా.. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, శ్రీనివాస గౌడ్‌, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ వంటివారు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ కార్యాల‌యం దాడి వెనుక కుట్ర ఉంద‌ని హ‌రీష్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బ‌లంతోనే ఈ దాడి జ‌రిగింద‌న్నారు.. దీనికి బ‌దులు తీర్చుకునేందుకు బీఆర్ ఎస్ శ్రేణులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్య‌మంత్రి, తెలంగాణ ఆవిర్భావం కోసం.. త‌న ర‌క్తాన్ని ధార‌పోసిన కేసీఆర్ కార్యాల‌యంపైనే దాడులు జ‌రిగితే.. ఇక‌, సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఉన్నాయా? అని నిల‌దీశారు.

Tags:    

Similar News