తెలంగాణ టు తమిళనాడు.. కాంగ్రెస్ పవర్ ఫుల్ స్కెచ్! కమ్మ నేత బ్యాక్ గ్రౌండ్ వర్క్

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పక్క రాష్ట్రం తమిళనాడులో అధికార డీఎంకేలో భాగస్వామిగా కొనసాగుతోంది.;

Update: 2026-02-10 00:30 GMT

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పక్క రాష్ట్రం తమిళనాడులో అధికార డీఎంకేలో భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగుతుండగా, అధికారంలో ఎక్కువ వాటా కోసం హస్తం పార్టీ పవర్ ఫుల్ స్కెచ్ వేస్తోందని అంటున్నారు. ఇందుకోసం తెలంగాణకు చెందిన కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓ నేతను రంగంలోకి దింపిందా? అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పెద్దగా పనిచేయని ఆ నేత తన సొంత సామాజికవర్గంలో పట్టు పెంచుకోడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో ఆ సామాజికవర్గానికి దాదాపు 8 శాతం ఓట్లు ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కమ్మ నేత ద్వారా అధికార డీఎంకేపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందా? అని సందేహిస్తున్నారు.

తమిళనాడులో అధికార డీఎంకేతో పొత్తుతో కాంగ్రెస్ బలమైన పార్టీగా కొనసాగుతోంది. జాతీయస్థాయిలో బీజేపీ ప్రభావంతో ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కోల్పోతున్నప్పటికీ దక్షిణ భారతదేశంలో మాత్రం కాంగ్రెస్ గట్టిగా పోరాడుతూనే ఉంది. దక్షిణాదిలో ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పనిచేస్తోంది. కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలో కొనసాగుతుండగా, తమిళనాడులో అధికార పార్టీ భాగస్వామిగా ఉంది. అదేవిధంగా కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో మరింత బలపడాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో 9 సీట్లలో పోటీ చేసి 9 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు పొందేలా తన మిత్రపక్షం డీఎంకేపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇందులో 18 చోట్ల ఆ పార్టీ గెలిచింది.

ఇక రానున్న ఎన్నికల్లో మరికొన్ని స్థానాలు అదనంగా కోరాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో మిత్రపక్షం డీఎంకేపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణకు చెందిన కమ్మ సామాజికవర్గం నేత జెట్టి కుసుమకుమార్ ను రంగంలోకి దింపారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన కుసుమకుమార్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే కుల సంఘాన్ని స్థాపించారు. తన సొంత సామాజికవర్గంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న కుసుమకుమార్ ఇంతకుముందు తెలంగాణలో కుల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా ఆదివారం భారీ సభను నిర్వహించారు. తమిళనాడులో కమ్మ సామాజికవర్గానికి సుమారు 65 లక్షల ఓట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఓట్లలో ఎక్కువ తమ కూటమికి దక్కేలా ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ కుసుమకుమార్ ను ముందు పెట్టి రాజకీయం చేస్తోందా? అని సందేమాలు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ నేత కుసుమకుమార్ కుల సంఘం సమావేశం నిర్వహించినా, పరోక్షంగా కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేసేలా కుసుమకుమార్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో కమ్మ సామాజికవర్గాన్ని కమ్మవార్ నాయుడు, నాయక్కర్ అన్న పేర్లతో పిలుస్తారు. చెన్నై, మధురై, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల్లో పరిశ్రమలు, వ్యాపార సంస్థలను నెలకొల్పి కమ్మ సామాజికవర్గం ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉందని చెబుతున్నారు. ఇక ఇన్నాళ్లు ఓటర్లుగానే తమను చూసిన పార్టీలు నాయకులుగా గుర్తించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ద్వారా కోరుతున్నారు.

అయితే, ఇది డీఎంకే ఓట్లను సంఘటితం చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్లాన్ గా ప్రతిపక్షాలు సందేహిస్తున్నాయి. ఇన్నాళ్లు తమిళనాడులోని తెలుగు ఓటర్లు అధికార డీఎంకేతోపాటు విపక్ష ఏఐడీఎంకేతోనూ కొనసాగుతున్నారు. అయితే తెలుగు ఓటర్లను కులాల వారీగా సంఘటితం చేయడానికి కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని అంటున్నారు. కుసుమకుమార్ ద్వారా ఈ ప్రయత్నం మొదలుపెట్టి త్వరలో మరికొందరు కుల సంఘాల నాయకులను రంగంలోకి దించాలని చూస్తోందని చెబుతున్నారు. దీనివల్ల మిత్రపక్షం డీఎంకేపై ఒత్తిడి తెచ్చి అధిక సీట్లు పొందడంతోపాటు ఎన్నికల్లో డీఎంకే కూటమికి మేలు జరిగేలా పావులు కదపడమే అంటున్నారు.

Tags:    

Similar News