ఓటమి షాకులు కాంగ్రెస్ ను వేధిస్తున్నా విరాళాల్లో మాత్రం వృద్ధి

ఒకటి తర్వాత మరొకటి చొప్పున ఓటమి షాకులు ఎదురవుతున్న కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. చూస్తుండగానే పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటం.;

Update: 2025-11-28 08:30 GMT

ఒకటి తర్వాత మరొకటి చొప్పున ఓటమి షాకులు ఎదురవుతున్న కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. చూస్తుండగానే పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటం. .మరో మూడేళ్లు అదే పరిస్థితి. 2029 నాటికి పరిస్థితుల్లో మార్పు వస్తుందా? అంటే అలాంటి ఆశాభావం ఏమీ కాంగ్రెస్ పార్టీలో కనిపించటం లేదు.

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొత్తగా అధికారంలోకి రాకున్నా.. తాము పవర్ లో ఉన్న రాష్ట్రాల్లోనూ తన మార్కు చూపించే విషయంలో కాంగ్రెస్ పాలకులు కిందా మీదా పడుతున్నారు. ఇందుకు కర్ణాటక అతి పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నవిరాళాల్లో మాత్రం వృద్ధి నమోదు కావటం విశేషం. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో పార్టీకి వచ్చిన విరాళాల వివరాల్ని వెల్లడించారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి తమకు 2501 మంది దాతల నుంచి రూ.517.37 కోట్ల విరాళాలు అందినట్లుగా పార్టీ పేర్కొంది. ఈ మొత్తం అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 83.80శాతం ఎక్కువ కావటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ముంబయికి చెందిన ఏబీ జనరల్ ఎలెక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.15 కోట్లు.. ఉదయ్ పూర్ లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సంస్థ రూ.10 కోట్లు.. కోల్ కతాకు చెందిన సజ్జన్ బజాంక రూ.6 కోట్లు.. న్యూడెమోక్రటిక్ ఎలెక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.5 కోట్లు.. సంజయ్ అగర్వాల్ రూ.5 కోట్లు.. ఐటీసీ లిమిటెడ్ రూ.4 కోట్లు అందినట్లుగా పేర్కొంది.

వీరితో పాటు డిరైవ్ ఇన్వెస్ట్ మెంట్స్ రూ.4 కోట్లు.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రూ.3 కోట్లు.. స్టార్ సిమెంట్ లిమిటెడ్ నుంచి రూ.3కోట్లు.. బెంగళూరుకు చెందిన క్లాసిక్ ఫెదర్ లైట్ వాటర్ ఫ్రంట్ డెవలపర్స్ నుంచి రూ3 కోట్లు.. గుర్ గ్రామ్ కు చెందిన ప్రేమ్ కుమార్ భజాంక రూ.3 కోట్లు పార్టీకి విరాళంగా ఇచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలన్నీ రూ.20వేలకు మించి అందిన విరాళాల వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. అందుకు తగ్గట్లే కాంగ్రెస్ తన విరాళాల చిట్టాను వెల్లడించింది.

Tags:    

Similar News