బాబాయ్ హత్యే చిన్నదైనప్పుడు.... జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం
బాబాయి దారుణ హత్యే చిన్న విషయంగా భావించిన వారికి.. శ్రీవారి పరకామణి దొంగతనం కేసు పెద్దవిషయం ఎలా అవుతుం దని.. అసలు వారికి ఇది పెద్ద విషయం అవుతుందని కూడా భావించడం మనతప్పేనని చంద్రబాబు అన్నారు.;
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన జగన్.. శ్రీవారి పవిత్ర లడ్డూ కల్తీ కావడం.. అదే ఆలయంలో పరకామణిలో డాలర్ల దొంగతనం వ్యవహారాలను ప్రస్తావించారు. అయితే.. అవేవీ పెద్ద విషయాలు కావన్నట్టుగా జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. జగన్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయని తెలిపారు.
బాబాయి దారుణ హత్యే చిన్న విషయంగా భావించిన వారికి.. శ్రీవారి పరకామణి దొంగతనం కేసు పెద్దవిషయం ఎలా అవుతుం దని.. అసలు వారికి ఇది పెద్ద విషయం అవుతుందని కూడా భావించడం మనతప్పేనని చంద్రబాబు అన్నారు. నైతికత లేని వారు ఇలానే వ్యాఖ్యలు చేస్తారని అన్నారు. శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూను కూడా కల్తీ చేశారని.. పాలు కాని పాలతో నెయ్యికాని నెయ్యితో ఈ లడ్డూలు తయారుచేసి.. పవిత్రతకు భంగం కలిగించారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి వారి వల్లే శ్రీవారి ఆలయం అపవిత్రం అయిపోయిందన్నారు.
పరకామణిలో కోట్లాది మంది భక్తులు శ్రీవారికి ముడుపులు సమర్పించుకుంటారని.. అలాంటి వాటిని దొంగతనం చేసింది కాక.. దానిని సమర్థించుకునే వారు తయారయ్యారని వ్యాఖ్యానించారు. ``నేను నా జీవితంలో ఎప్పుడూ దొంగలతో సెటిల్‌మెంట్లు చూడలేదు. తొలిసారి తిరుమల పరకామణి కేసులోనే విన్నాను. 70 వేలు కొట్టేసి.. 14 కోట్ల రూపాయలు ఇచ్చారంటే.. వారెంత గా సంపాయించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. వారెంత ఘటికులో అర్థం అవుతుంది. శ్రీవారి సొత్తును ఇంకెంత దోచేశారో.. అన్న అనుమానాలు కూడా భక్తులకు వ్యక్తమవుతున్నాయి.`` అని చంద్రబాబు అన్నారు.
జగన్‌కు లెక్కలేదు..
``జగన్‌కు కుటుంబ సభ్యులంటే పట్టదు. దేవుడంటే కూడా పట్టదు. ఆయనకు దేవుడన్నా.. భక్తులన్నా.. ఆలయాలన్నా చులకన. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం తెలుగు ప్రజలు చేసుకున్న పాపం`` అని చంద్రబాబు అన్నారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందాం అని చూసిన జగన్... పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమని చంద్రబాబు అన్నారు. దొంగతో ఎవరైనా ఒప్పందాలు సెటిల్మెంట్లు చేసుకుంటారా? అని ప్రశ్నించారు.