బాబు పదే పదే చెబుతున్నా మంత్రులు మాత్రం !

ఇదిలా ఉంటే మంత్రివర్గ సమావేశం కూటమి ప్రభుత్వం ప్రతీ నెలా రెండు సార్లు నిర్వహిస్తోంది. ఆ సమయంలో ఏదో ఒక ఇష్యూతో వైసీపీ సిద్ధంగా ఉంటోంది.;

Update: 2025-09-05 02:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నాలుగవ సారి సీఎం అయిన తరువాత చాలా మారిపోయారు అని చెప్పాలి. ఆయన ఏ విషయంలోనూ అసలు లైట్ తీసుకోవడం లేదు. గతంలో మాదిరిగా ఎక్కడా వదిలిపెట్టడం లేదు. అవతల పక్షం నుంచి విమర్శలు వచ్చినపుడు అవి చిన్నవా పెద్దవా అని కూడా చూడటం లేదు. చిన్న పాముని అయినా పెద్ద కర్రతో కొట్టమన్న రాజనీతిని అమలు చేస్తున్నారు. చంద్రబాబు చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. చాలా విషయాలలో ఆయన గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

ప్రతీ సారీ ఒక ఇష్యూ :

ఇదిలా ఉంటే మంత్రివర్గ సమావేశం కూటమి ప్రభుత్వం ప్రతీ నెలా రెండు సార్లు నిర్వహిస్తోంది. ఆ సమయంలో ఏదో ఒక ఇష్యూతో వైసీపీ సిద్ధంగా ఉంటోంది. దాని మీద బాబు అయితే తన కేబినెట్ సహచరులు ఏ విధంగా స్పందించారు ఎలా వ్యవహరించారు అన్న దాని మీద అంతా గమనిస్తూనే ఉన్నారు. గతంలో చూస్తే రైతుల సమస్యల మీద జగన్ టూర్లు చేస్తూ విమర్శలు గుప్పించేవారు. దాని విషయంలో కూడా మంత్రులు సరిగ్గా రియాక్ట్ కాలేదని ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించలేదని బాబు మంత్రివర్గ సమావేశంలోనే క్లాస్ తీసుకున్నారు. తాజాగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా బాబు మంత్రులకు ఒక విధంగా క్లాస్ తీసుకుని కొన్ని విషయాల మీద సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతోంది.

యూరియా మీద దుష్ప్రచారం :

వైసీపీ ఏపీలో యూరియా కొరత ఉందని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోందని బాబు మంత్రి వర్గ సమావేశంలో ప్రస్తావించారని అంటున్నారు. రాష్ట్రంలో చూస్తే ఎరువులకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన గుర్తు చేశారు అయినా సరే వైసీపీ ఈ ఇష్యూని జనంలోకి తీసుకుని వెళ్ళి సర్కార్ ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోంది అని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రులు మాత్రం పెద్దగా రియాక్ట్ కాకపోవడమేంటి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అంటున్నారు. సరైన సమయంలో వైసీపీ చెడు ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడమేంటి అని అసహనం వ్యక్తం చేశారు అని అంటున్నారు. అలా చేయకపోవడం వల్ల అది జనంలోకి పోతుంది అని ఆయన అన్నారని చెబుతున్నారు.

కట్టడి చేయాల్సిందే :

వైసీపీ ఎక్కువగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తోంది అని అని అన్నారు. ఇలాంటి వాటి మీద ఎప్పటికపుడు అప్రమత్తంగా అంతా ఉండాలని ఆయన సూచించారు. మరో వైపు చూస్తే సోషల్ మీడియాలో పోస్టుకు కూడా బాధ్యతాయుతంగా జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు అందుకోసం ఒక చట్టం తీసుకుని రావాల్సి ఉందని కూడా ఆయన చెప్పారు. ప్రతీ విషయం మీద నానా యాగీ విపక్షం చేస్తున్నా అధికార పక్షం వైపు నుంచి సరైన స్పందన లేకపోతే తప్పుడు సంకెతాలు జనంలోకి పోతాయని అంతా అలెర్ట్ గా ఉండాలని బాబు మంత్రులను కోరారని చెబుతున్నారు.

పవన్ కూడా సై :

ఇక తన మీద కూడా దుష్ప్రచారం చేస్తూ టార్గెట్ చేస్తున్నారు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అభిప్రాయలను పంచుకున్నట్లుగా చెబుతున్నారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తాను ఆ కుటుంబానికి అండగా ఉన్నాను అని అందుకే తనను ఈ రోజున రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు. వైసీపీ చేసే విష ప్రచారాన్ని అంతా కలసి తిప్పు కొడతామని ధీటుగా ఎదుర్కొందామని పవన్ మంత్రివర్గ సమావేశంలో అన్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వంలోని మంత్రులు కీలక అంశాల మీద సరిగ్గా వేగంగా రియాక్ట్ కావడం లేదన్న అసంతృప్తి అయితే కూటమి పెద్దలలో ఉందని అంటున్నారు. మరి ఈసారితో అయినా తీరు మార్చునుని దూకుడుగా ముందుకు సాగుతారా లేదా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

Tags:    

Similar News