ఇరాన్ దిశగా అమెరికా సైన్యం... ట్రంప్ వార్నింగ్
ఇరాన్ ను ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించామని, అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఇరాన్ వైపుగా కదులుతోందని ట్రంప్ తెలిపారు.;
ఇరాన్ ను ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్ చుట్టూ భారీ నౌకాదళాన్ని మోహరించామని, అమెరికాలోని అతిపెద్ద సైన్యం ఇరాన్ వైపుగా కదులుతోందని ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించారు. గతంలోనే ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కానీ కాస్త వెనక్కి తగ్గారు. కానీ ఇప్పటికీ ఇరాన్ లో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో మరోసారి హెచ్చరించారు. ఇరాన్ లో పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, ఏం జరుగుతుందో వేచిచూద్దామని అన్నారు. ఇరాన్ లో వందల మంది నిరసనకారులకు అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష విధించిందని, తాము జోక్యం చేసుకోవడంతో వారందరికీ ఉరిశిక్ష తప్పిందన్నారు. నిరసనకారులను ఉరితీస్తే.. తాము చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతోనే అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. అమెరికా నుంచి భారీ విమాన వాహక నౌకతో పాటు సైన్యం ఇరాన్ వైపుగా వస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను పంపుతున్నట్టు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
ఇరాన్ లో ట్రంప్ పెత్తనం ఏంటి ?
ఇరాన్ లో ఆర్థిక సంక్షోభం ఉంది. అక్కడ ప్రజలు పాలవర్గాన్ని దించాలని ప్రయత్నిస్తున్నారు. పోరాడుతున్నారు. అది ఆ దేశానికి సంబంధించిన సమస్య. మరి ట్రంప్ కు ఉన్న అధికారం ఏంటి ?. ఇరాన్ ను ఎందుకు బెదిరిస్తున్నారు ?. ఇరాన్ పై అమెరికాకు ఉన్న ఆధిపత్యం ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఇరాన్ సార్వభౌమాధికారంపై పెత్తనం చెలాయించడానికి అమెరికాతో పాటు ఏదేశానికి హక్కు లేదు. కానీ అమెరికా పెత్తనం చెలాయిస్తోంది. బెదిరిస్తోంది. ఇరాన్ లో బలహీనతలను ఆసరాగా చేసుకుంది. అక్కడి ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోంది. ముఖ్యమంగా ఇరాన్ చైనాతో, రష్యాతో వాణిజ్యం జరుపుతోందని అక్కసు వెళ్లగక్కుతోంది. అదే సమయంలో అక్కడి ఆయిల్ నిల్వలపైన, వ్యాపారంపైన పెత్తనం కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇరాన్ పై తనకేదో సర్వాధికారాలు ఉన్నట్టు ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచ దేశాలు తమకెందుకులే అన్నట్టు చూస్తు ఉండటంతో ట్రంప్ ఆటలు సాగుతున్నాయి. వెనుజులాలో అదే జరిగింది. ఇరాన్ లో అదే జరగబోతోంది. గ్రీన్ ల్యాండ్ జోలికి వెళ్లే సరికి యూరప్ దేశాలు గట్టి షాక్ ఇవ్వడంతో ట్రంప్ తగ్గారు.
కర్ర పెత్తనం
అమెరికాకు ఉన్న ఆయుధ సంపత్తి, డాలర్ తో ప్రపంచ వాణిజ్యం పై ఉన్న గుత్తాధిపత్యం.. కర్ర పెత్తనం చేసే దిశగా అమెరికాను నడుపుతున్నాయి. డాలర్ ద్వారా వ్యాపారం చేయకుండా.. ఆ వ్యవస్థ నుంచి ప్రపంచ దేశాలు బయటికి వస్తే అప్పుడు అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు ఆ దిశగా కదులుతున్నాయి. ట్రంప్ కున్న ఆధిపత్యంతో ఆయా దేశాల్లోని సహజ వనరులను, రాజకీయాలను, సప్లై చైన్లను, సప్లై రూట్స్ ను నియంత్రిస్తున్నారు. చైనాకు చెక్ పెట్టే దిశగా వెనుజులా, గ్రీన్ ల్యాండ్, ఇరాన్ వంటి సహజవనరుల నిల్వ ఉన్న దేశాలపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయా దేశాలు తాను చెప్పినట్టు విననప్పుడు ఆంక్షలు విధించి.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేసి.. రాజకీయ అంతర్యుద్ధ్యం ప్రేరేపిస్తున్నారు. ఇదే ఇరాన్ లో జరుగుతోంది.